న్యూఢిల్లీ: తిరుపతి లోకసభ సీటు విషయంలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కు బిజెపి షాక్ ఇచ్చింది. తిరుపతి లోకసభ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఈ సీటు తమ పార్టీకి కేటాయించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరుతున్నారు. అయితే, అందుకు బిజెపి సిద్దంగా లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రకటనను బట్టి అర్థమవుతోంది.

తిరుపతి లోకసభ సీటును జనసేనకు ఇవ్వబోమని, తామే అక్కడ పోటీ చేస్తామని జీవీఎల్ అన్నారు. తమ పార్టీ గతంలో తిరుపతిలో గెలిచిందని ఆయన గుర్తు చేశారు.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ  చేయకుండా పవన్ కల్యాణ్ బిజెపికి మద్దతు ఇచ్చినందుకు గాను తమకు తిరుపతి సీటు కేటాయించాలని పవన్ కల్యాణ్ కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. 

ఆ విషయంపై బిజెపి పెద్దలతో మాట్లాడడానికే పవన్ కల్యాణ్ ఢిల్లీలో ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అకాల మరణంతో తిరుపతి లోకసభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. 

ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం తమ తమ అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ తరఫున పనబాక లక్ష్మి పోటీ చేయనున్నారు. వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖరారు చేశారు.