ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం కష్టపడుతుంటే.. కేసీఆర్, కేటీఆర్‌లు డబ్బాలు కొట్టుకుంటున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు చురకలంటించారు. కేసీఆర్ ఇప్పటికీ ఏపీ ప్రజలను మోసం చేస్తూనే వున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదంటూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటన మరోసారి రెండు రాష్ట్రాల్లో రాజకీయాలను వేడెక్కించింది. ఇది తమ ఘనతేనంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి వైసీపీ నేతలు, మంత్రులు కౌంటరిస్తున్నారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. కేసీఆర్ ఇప్పటికీ ఏపీ ప్రజలను మోసం చేస్తూనే వున్నారని జీవీఎల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వర్కింగ్ క్యాపిటల్ సమస్య వున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ, టీడీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో మాట్లాడలేదని జీవీఎల్ నరసింహా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్ ఉద్యోగులకు భరోసా కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోందని.. కేసీఆర్ లాగా తాము డబ్బాలు కొట్టుకోమన్నారు. ప్లాంట్ పరిరక్షణ కోసం కేంద్రం కష్టపడుతుంటే.. కేసీఆర్, కేటీఆర్‌లు డబ్బాలు కొట్టుకుంటున్నారని జీవీఎల్ చురకలంటించారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కేసీఆరే కారణమని.. ఆయన తన ఆస్తులను భారీగా పెంచుకుని, ప్రజలను అప్పుల్లోకి నెట్టారని నరసింహారావు ఆరోపించారు. 

ALso Read: ఉట్టికి ఎగురలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుంది:విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేటీఆర్ కు పేర్నినాని కౌంటర్

ఆంధ్రాలో అడుగు పెట్టాలని కేసీఆర్ కలలు కంటున్నారని.. అయితే ముందుగా ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఏపీకి వచ్చి ఉద్దరిస్తాననడం సిగ్గుచేటన్న జీవీఎల్.. తెలంగాణ నుంచి ఏపీకి ఎన్నో నిధులు రావాల్సి వుందన్నారు. ఏపీలో వున్న ప్రభుత్వానికి దీనిపై అడిగే దమ్ము లేదంటూ మండిపడ్డారు. 6400 కోట్ల విద్యుత్ బకాయిలు ఏపీకి చెల్లించాల్సి వుందని.. విభజన చట్టంలో పేర్కొన్న వాటిని ఏపీకి ఇవ్వడం లేదని జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించాకే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆర్టీసీని ఎందుకు ప్రైవేట్‌పరం చేస్తున్నారని జీవీహెల్ ప్రశ్నించారు. ఏపీలో డ్రామాలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. తెలంగాణలో వున్న సెటిలర్లు రెండు రాష్ట్రాల మధ్య సఖ్యత కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.