విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రం విధాన నిర్ణయం తీసుకోలేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు . శుక్రవారం ఓ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ... విపక్షాలు రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు.

కియా వస్తే క్రెడిట్‌ మాదే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్‌ చెప్పుకున్నారని జీవీఎల్ గుర్తు చేశారు. ప్రైవేట్‌ సంస్థలు వస్తే రాష్ట్రం ఇబ్బందుల పాలవుతుందనడం సరికాదని నరసింహారావు విమర్శించారు.

స్థానికుల మనోభావాలు, ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. స్టీల్‌ప్లాంట్‌పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అంతిమ నిర్ణయం జరగాలంటే ఇంకా పెద్ద ప్రక్రియ ఉంటుందని... భూతద్దంలో చూపిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని జీవీఎల్ దుయ్యబట్టారు.

Also Read:స్టీల్ ప్లాంట్‌పై కేంద్రం యత్నాలు ఇలా.. మీరేమో అలా: సోము వీర్రాజుకు గంటా కౌంటర్

రాజకీయ ప్రయోజనాల కోసమే ఇరు పార్టీలు పాకులాడుతున్నాయని బీజేపీ ఎంపీ ఆరోపించారు. రామతీర్థం ఘటనలో దోషులను ఇప్పటి వరకు అరెస్ట్‌ చేయలేదని జీవీఎల్ నరసింహారావు గుర్తుచేశారు.

అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రాష్ట్ర నాయకత్వం వ్యాఖ్యలు సరికాదన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. విశాఖ ఉక్కు పరిరక్షణ చారిత్రక అవసరమని ఆయన అభివర్ణించారు.  ప్రయత్నాలు మొదలయ్యాయని నేరుగా కేంద్రం ప్రకటిస్తోందని గంటా గుర్తుచేశారు.

స్టీల్ ప్లాంట్ కోసం ప్రజా ఉద్యమం వస్తుందని ఆయన హెచ్చరించారు. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని.. ఏపీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ పెద్దలను ఒప్పించాలని గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు పోరాడాలని.. గంటా సూచించారు.