తెలంగాణ ఎన్నికల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు అసహనం పెరిగిపోయిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అభిప్రాయపడ్డారు. తమ పార్టీకి తెలంగాణలో కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చినందుకు చంద్రబాబు తెగ సంతోషపడుతున్నారని.. ఏపీలో త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలస్తుందని జోస్యం చెప్పారు.

కాకినాడలో మహిళా కౌన్సిలర్ పట్ల చంద్రబాబు ప్రవర్తించిన తీరు దారుణమన్నారు. చంటిబిడ్డ తల్లిని పట్టుకొని ఫినిష్ చేస్తా అంటూ వ్యాఖ్యలు చేసి చంద్రబాబు తన స్థాయిని  చింతమనేని, జేసీ, బుద్ధా వెంకన్న, రాజేంద్రప్రసాద్ ల స్థాయికి దిగజార్చుకున్నారని అభిప్రాయపడ్డారు. బీజేపీ నేతలను సీఎం బెదిరించిన 24గంటల్లొ కన్నా లక్ష్మీనారాయణ ఇంటి మీద టీడీపీ నేతలు దాడి చేశారన్నారు.

రౌడీ రాజకీయాలు చేసేవారు ఎప్పటికైనా కాలగర్భంలో కలిసిపోతారన్నారు. కన్నా ఇంటిపై దాడిచేసిన గుండాలను అరెస్టు చేసి.. బీజేపీ నాయకులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.