టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన బిడ్డ పెళ్లి క్రైస్తవ మత ఆచార ప్రకారం చేశారని.. తాను నాస్తికుడినని స్వయంగా చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఆయనకు పుష్ప సినిమా చూపించాలేమో అంటూ ఫైర్ అయ్యారు. 

టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. ఓటర్ చేతన్ మహాభియాన్ కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించిన ఆయన టీటీడీలో ప్రస్తుత పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని.. తిరుమలకు భక్తులు రాకుండా చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు.

భక్తులను కాపాడలేక వారి చేతికి కర్రలు ఇస్తారా అని ప్రశ్నించారు. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ బిడ్డ పెళ్లి క్రైస్తవ మత ఆచార ప్రకారం చేశారని.. తాను నాస్తికుడినని భూమన స్వయంగా చెప్పారని ఘాటు వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తిరుమలలో అడవులున్న విషయం తెలియదని అంటున్నారని.. ఆయనకు పుష్ప సినిమా చూపించాలేమో అంటూ ఫైర్ అయ్యారు. 

ALso Read: తిరుమల .. రెండు చిరుతలు మ్యాన్ ఈటర్‌గా మారాయి : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

హిందువులుగా ఆలోచించాలని బండి సంజయ్ వైసీపీ కేడర్‌కు విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మతానికే కొమ్ము కాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారని .. జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టాలని బండి సంజయ్ కోరారు. 

మరోవైపు తిరుమల నడకదారిలో చిరుత పులుల సంచారంతో భక్తులు భయాందోళనలకు గురవుతున్న సంగతి తెలిసిందే. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే చిరుతల నుంచి రక్షించుకునేందుకు గాను కర్రలను కూడా అందజేస్తోంది. మరోవైపు చిరుతల అంశంపై రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో చిన్నారి మృతి చెందడం బాధాకరమని..బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించామని పెద్దిరెడ్డి తెలిపారు. 

భక్తులపై చిరుతలు దాడి చేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని.. అయితే రెండు చిరుతలు మ్యాన్ ఈటర్‌గా మారాయని మంత్రి తెలిపారు. వీటిని జూ పార్క్‌లో వుంచుతామని ఆయన పేర్కొన్నారు. నడకమార్గంలో శాశ్వత ప్రాతిపదికన కంచెను ఏర్పాటు చేసేందుకు టీటీడీ, అటవీ శాఖలు యోచిస్తున్నాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. టీటీడీ పరిధిలో వున్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని.. టీటీడీకి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. 

ALso Read: తిరుమలలో చిరుత కలకలం .. మొదటి ఘాట్ రోడ్‌లో కెమెరాకు చిక్కిన వైనం, రంగంలోకి అధికారులు

మరోవైపు.. తిరుమలగిరుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. భక్తుల సంరక్షణ కోసం టీటీడీ అధికారులు మూడంచెల వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. భక్తులు నిఘా నీడలో కాలినడక సాగించడం, చిరుతలను బంధించడం , చిరుతల సంచారంపై అధ్యయనం చేయడం వంటి వ్యూహాలను అమలు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వచ్చిన బృందం చిరుతల సంచారంపై అధ్యయనం చేయనుంది.