భారతీయ జనతా పార్టీ ఎంఎల్సీ సోము వీర్రాజు మరోసారి టిడిపిపై రెచ్చిపోయారు. చెన్నైలోని ఆర్కె నగర్ ఎన్నికలో భాజపాకు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని విజయనగరం టిడిపి ఎంఎల్సీ చేసిన వ్యాఖ్యలపై వీర్రాజు మీడియాతో గురువారం సాయంత్రం మాట్లాడారు. డిపాజిట్లు రాకపోవటంపై టిడిపి నేతలు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూనే చంద్రబాబునాయుడుపై పరోక్షంగా మండిపడ్డారు. ఎన్టీఆర్ టిడిపి పెట్టినపుడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే ఎన్టీఆర్ పైనే పోటీ చేస్తానని చెప్పిన విషయాన్ని మేము ఎక్కడైనా ప్రస్తావించామా అంటూ నిలదీసారు. అలాగే, ‘కాంగ్రెస్ తరపున పోటీ చేసిన చంద్రబాబుకు డిపాజిట్ కూడా దక్కలేదని తామెక్కడైనా అన్నామా’ అంటూ వీర్రాజు చంద్రబాబు పరువు తీసేసారు.

తమకు మిత్రపక్షంగా ఉంటూనే టిడిపి ఎందుకు తమపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తోంది అంటూ చంద్రబాబును నిలదీసారు. అందుకు చంద్రబాబు ఎందుకు అనుమతిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో భాజపా ఎదగాలని చేస్తున్న ప్రయత్నాలను టిడిపి జీర్ణించుకోలేక పోతున్నట్లు మండిపడ్డారు. అమరావతిపై దృష్టి పెట్టిన చంద్రబాబు రాయలసీమ జిల్లాలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు విరుచుకుపడ్డారు. పోలవరంపై చంద్రబాబు దృష్టి పెడుతున్నట్లు మిగిలిన ప్రాజెక్టులపై ఎందుకు పెట్టటం లేదని ప్రశ్నించారు. రాజధాని డిజైన్ల పేరుతో కాలయాపన జరుగుతోందని అభిప్రాయపడ్డారు.

గతంలో జరిగిన తప్పే మళ్ళీ జరుగుతోందన్నారు. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి మొత్తాన్ని హైదరాబాద్ కు పరిమితం చేసిన పాలకులు మళ్ళీ ఇపుడు అభివృద్ధిని అమరావతికి పరిమితం చేస్తున్నట్లు మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో తమకు 14 సీట్లిచ్చినా కేవలం 4 సీట్లలో మాత్రమే గెలవనిచ్చారంటూ ధ్వజమెత్తారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో 9 వార్డులిచ్చి 6 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్ధులను ప్రోత్సహించినట్లు ఆరోపించారు.