ఏపీ అభివృద్ధి చెందకుండా సీఎం చంద్రబాబు నాయుడే అడ్డుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఆరోపించారు. భోగాపురం ఎయిర్ పోర్టుని అడ్డుకున్నది కూడా చంద్రబాబేనని ఆయన పేర్కొన్నారు.

గతంలో అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారని మండిపడ్డారు.

కేంద్రం ప్రవేశపెట్టిన సరళీకృత వాణిజ్య విదానాల వల్లే ఏపికి ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో మొదటిస్థానం వచ్చిందని పేర్కొన్నారు. కేంద్రం నిధులతోనే తోటపల్లి ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని సోమువీర్రాజు అన్నారు.  రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని...తమ నిజాయితీని శంకించొద్దని సోమువీర్రాజు తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో చలసాని శ్రీనివాస్‌, నటుడు శివాజీలను నడిపిస్తోంది చంద్రబాబేనని, ఆయన తెరవెనుక ఉండి వారితో మాట్లాడిస్తున్నారని సోమువీర్రాజు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని.. పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. 2019లో మళ్లీ బీజేపీనే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.