విజయనగరం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. క్రైస్తవ పాస్టర్లకు ప్రజాధాన్ని ఇస్తామనడం సరికాదంటూ హెచ్చరించారు. అర్చకులకు ఇస్తున్న జీత భత్యాలు ఎండోమెంట్ శాఖ, హిందూ దేవాలయాల ఆస్తుల నుంచి ఇస్తున్నారని గుర్తు చేశారు. 

అలాగే పాస్టర్లకు జీతాలు ఇవ్వాలంటే క్రైస్తవ సంస్థలు లేదా ఆస్తుల నుంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాంటి సాహసం జగన్ చేయగలరా అంటూ సవాల్ విసిరారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. టీటీడీ చైర్మన్లుగా స్వామీజీలనే నియమించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. 

ఇకపోతే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ వస్తున్న వార్తలు నిజమేనన్నారు. తమ పార్టీలోకి వచ్చేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడంలో తప్పులేదన్నారు. 

బీజేపీకి టచ్ లో వైసీపీ ఎంపీలు : బాంబు పేల్చిన ఎమ్మెల్సీ సోము వీర్రాజు

ఇకపోతే రాష్ట్ర రాజకీయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయోగిస్తున్న బాష సరికాదన్నారు. ప్రజా స్వామ్యంలో  విలువలకు విరుద్దంగా నేతలు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒక పవిత్రమైన పదవిలో ఉన్న స్పీకర్ తమ్మినేని సీతారాం సైతం సరైన భాష ఉపయోగించకపోవడం బాధాకరమన్నారు. 

మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు భాష కూడా సరిగ్గా లేదన్న విషయం తెలుసుకోవాలన్నారు. వైసీపీ మంత్రులతోపాటు చంద్రబాబు భాష కూడా సరిగ్గాలేదని చెప్పుకొచ్చారు.  

డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ ఎథిక్స్ కమిటి సమావేశంలో నేతల బాషపై  చర్చించాలని సూచించనున్నట్లు తెలిపారు. ఏపిలో ప్రజాపక్షంగా ఉండి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇసుక పోలసీ  విషయంలో కాంట్రాక్టు విధానం అవలంభించి ప్రజలకి చౌకగా ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. 

 20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం