మొత్తం మీద అందరూ అనుమానించినట్లుగానే పోలవరం పై మిత్రపక్షాలు ‘బ్లేమ్ గేమ్’ సిద్దపడుతున్నాయి. అందులో భాగంగానే చంద్రబాబు-భాజపా నేతల మధ్య మాటలు యుద్దం మొదలైంది. గురువారం చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలకు శుక్రవారం ఉదయం భాజపా ఎంఎల్సీ సోమువీర్రాజు తీవ్రంగా స్పందించారు.

పోలవరం పనులు పూర్తి చేయలేకపోయిన నెపాన్ని నరేంద్రమోడి పైన వేస్తానంటే కుదరదన్నారు వీర్రాజు. పోలవరం ప్రాజెక్టును కేంద్రంగా చేసుకుని భాజపా-టిడిపిలు రాజకీయాలు మొదలుపెట్టాయి. కేంద్రం నిర్మించాల్సిన జాతీయ ప్రాజెక్టు పోలవరంను చంద్రబాబునాయుడు తన చేతుల్లోకి లాక్కున్నపుడే అర్దమైపోయింది ఈ ప్రాజెక్టు భవిష్యత్తు. అటువంటిది మూడున్నరేళ్ళ తర్వాత ‘కేంద్రం సహకరించకపోతే ప్రాజెక్టును కేంద్రానికి ఇచ్చేసి దండం పెట్టేస్తా’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

ఎప్పుడైతే, చంద్రబాబు కేంద్ర వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారో వెంటనే భాజపా నేతలు అప్రమత్తమయ్యారు. వెంటనే ఏం జరుగుతోందో కేంద్రంలోని పెద్దలతో మాట్లాడారు. ఇదే విషయమై వీర్రాజు మాట్లాడుతూ, మూడున్నరేళ్ళ తర్వాత పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి ఇచ్చేస్తానంటే ఎలా కుదురుతుంది? అంటూ చంద్రబాబును నిలదీసారు. అవగాహన లేకుండా చంద్రబాబు అలా మాట్లాడకూడదంటూ చురకలంటించారు. కేంద్రంలోని ఎవరో అధికారి నుండి వచ్చిన లేఖను పట్టుకుని చంద్రబాబు అంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని వీర్రాజు అభిప్రాయపడ్డారు.

‘కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లండన్ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్ళి మాట్లాడుతానని చంద్రబాబు చెబుతున్నారు కదా’? ‘సమావేశం అవ్వనీయంగా చూద్దాం ఏం జరుగుతుందో’ అని ఎంఎల్సీ అన్నారు. ప్రాజెక్టు పనులను అర్ధాంతరంగా నిలిపేస్తే ఎలాగంటూ కేంద్రాన్ని నిలదీస్తున్న చంద్రబాబు రాష్ట్రంలో తాను చేస్తున్నదేంటి? అంటూ ప్రశ్నించారు. కాకినాడ-రాజం మధ్య 150 కిలోమీటర్ల రోడ్డు పనులకు ఎనిమిది మాసాలుగా టెండర్ ప్రక్రియ జరుగుతుంటే అర్ధాంతరంగా ఎందుకు రద్దు చేశారంటూ చంద్రబాబును నిలదీసారు.