కడప: వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ వ్యాప్తంగా పర్యటింది దేశానికి మంచి రాజ్యాంగాన్నిఅందించారని కొనియడారు. 

అయితే ఆ రాజ్యాంగాన్ని వైసీపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగు మీడియంను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ నిప్పులు చెరిగారు. గతంలో తెలుగుమీడియం రద్దుకు టీడీపీ జీవో 14ను తీసుకువస్తే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం 81 జీవోను తీసుకువచ్చిందన్నారు. 

తెలుగు భాషను విస్మరించడం అంటే రాజ్యాంగ ఉల్లంఘనేనంటూ చెప్పుకొచ్చారు. తెలుగుభాష పనికిరాదని వైసీపీ ప్రజాప్రతినిధులు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో భాష కోసం వాళ్లు చేస్తున్న ప్రయత్నాన్ని అంతా గమనించాలని సూచించారు. 

తెలుగు భాష వల్ల ఉద్యోగాలు రావు అంటూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు వారి వారి అవివేకానికి నిదర్శనమంటూ కొట్టిపారేశారు. మాతృభాషతోనే ఏదైనా సాధిస్తామని అందులో ఎలాంటి సందేహం లేదని చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. 

2015 నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 26న దేశ వ్యాప్తంగా భారత రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివాస్ గా జరుపుకోవడం జరుగుతుందన్నారు. డా.బి.ఆర్.అంబేద్కర్ ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి ఇవ్వడం జరిగిందన్నారు. 

రాజ్యాంగంలో డా.బి.ఆర్ అంబేద్కర్ అనేక రకమైన అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేశారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రచించినట్లు స్పష్టం చేశారు.  

భారత రాజ్యాంగ నిర్మాత అయిన డా.బి.ఆర్ అంబేద్కర్ ప్రపంచ నాయకుడు అని తెలిపే విధంగా నరేంద్ర మోడీ కార్యక్రమాలు చేపడుతున్నారని స్ఫష్టం చేశారు. సంవిధాన్ దివాస్ రోజున రాజ్యాంగ నిర్మాతలను స్మరించుకోవడం విశేషమన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

అభివృద్ధి పేరుతో విశాఖలో మకాం వేసిన వైసీపీ నేత...: బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఫైర్