రాజమహేంద్రవరం: బీజేపీని బలోపేతం చేసేందుకు ఎవరినైనా తమ పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తాము కూడా ఏపీలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆశించడంలో తప్పులేదన్నారు. 

ఏపీలో ఒంటరిగా బలపడేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా బీజేపీని బలపరిచేందుకు ఎవరైనా తమ పార్టీలోకి వస్తామంటే తాము స్వాగతిస్తున్నట్లు సోము వీర్రాజు స్పష్టం చేశారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. బీజేపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, పోర్టులు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, తీరప్రాంతాల అభివృద్ధికి 5లక్షల కోట్లు కేంద్రం మంజారు చేస్తోందని తెలిపారు. 

అంతర్వేదిలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ నిర్మాణం చేసి తీరతామని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం ప్రభుత్వం వేసిన కమిటీ నిఫుణులు ఎవర్నీ కలవకుండానే నివేదికలు ఇచ్చేస్తుందని మండిపడ్డారు. 

విశాఖపట్నంలో ఇసుక సరఫరాలో అత్యధికంగా రేట్లు వసూలు చేస్తున్నారని తెలిపారు.ప్రభుత్వంలోని ఒకాయన విశాఖపట్నంలో మకాంవేసి అభివృద్ధి చేస్తానంటాడంటూ పరోక్షంగా విజయసాయిరెడ్డిపై విమర్శలు గుప్పించారు. ఏపీలో మినరల్స్ పై రూ.600 కోట్లు ఆదాయం వస్తుందని..

కానీ అదే ఇసుక వేలం వేస్తే రూ.5వేల కోట్లు ఆదాయం వస్తుందన్నారు.అయితే ఇసుకను చౌకగా అమ్మాలని సూచించారు. పంతానికి పట్టింపులకు పోకుండా పరిపాలన సాగాలని తెలిపారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇసుకలో వైట్ కాలర్ మాఫియా నడుస్తోందని ఆరోపించారు. 

ఇసుక కొందరికి బంగారు నిధిగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహమే లేదన్నారు. కొందరు ఇసుకతోనే కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఇసుక అందరికీ పారదర్శకంగా సరఫరా జరగాలంటే ప్రత్యేక అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  

పరిపాలన అంటే పసుపు-కుంకమ, నవరత్నాలు మాత్రమే కాదన్నారు. నెల్లూరులో పోర్టు చంద్రబాబు నాయుడు కట్టలేదన్నారు. దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు సోము వీర్రాజు. ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడమే తమ లక్ష్యమంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు.