బిజెపి-టిడిపిల మధ్య పొత్తులు చివరి దశకు చేరుకున్నట్లే కనబడుతోంది. చంద్రబాబునాయుడు క్యాబినెట్ నుండి బిజెపికి చెందిన ఇద్దరు మంత్రులు బయటకు వచ్చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని ఢిల్లీ బిజెపి జాతీయ నాయకత్వ నుండి రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబుకు ఫోన్ వచ్చినట్లు ప్రచారం ఊపందుకుంది.

దాంతో బిజెపి మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాసరావులు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు. గతంలోనే మాణిక్యాలరావు మాట్లాడుతూ తాను రాజీనామాకు సిద్ధంగా ఉన్నట్లు మీడియాతోనే చెప్పారు. అంతేకాకుండా బిజెపి నేతలు కూడా రాజీనామాలు చేయాల్సిందిగా మంత్రులపై ఒత్తిడి తెస్తున్నారు.

కేంద్రానికి వ్యతిరేకంగా చంద్రబాబు గనుక ఏమైనా ప్రకటన చేస్తే వెంటనే రాజీనామాలు చేయటానికి సిద్ధంగా ఉండాలంటూ జాతీయ నాయకత్వం ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. బిజెపి మంత్రులు కూడా అదే విషయాన్ని ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు క్యాబినెట్ నుండి బిజెపి మంత్రులు తొలగితే దాని ప్రభావం కేంద్రంపైన కూడా పడే అవకాశం ఉంది.

ఎందుకంటే, నరేంద్రమోడి క్యాబినెట్లో టిడిపికి చెందిన అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి మంత్రులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మొత్తానికి బిజెపి-టిడిపి పొత్తుల విషయం క్లైమ్యాక్స్ చేరుకున్నట్లే కనబడుతోంది.