రాష్ట్ర బిజెపిలో ముసలం పుట్టిందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. విజయవాడలో జరిగిన బిజెపి నేతల కీలక సమావేశంలో జరిగిన చర్చలు నేతల మధ్య ఉన్న విభేదాలను బట్టబయలు చేసింది. చివరకు సమావేశంలో బిజెపి అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపి కంభంపాటి హరిబాబు మీద తిరుగుబాటు చేసేదాకా పరిస్ధితులు దిగజారాయి.

ఇంతకీ జరిగిందేమిటంటే, బిజెపిలో రెండు వర్గాలున్నాయి. చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఒక వర్గం వ్యవహరిస్తుంటే మరో వర్గం వ్యతిరకేం. మూడేళ్ళపాటు చంద్రబాబు అనుకూల వర్గానిదే ప్రతీ విషయంలో పై చేయిగా ఉండేది. ఎందుకంటే, వారికి వెంకయ్యనాయుడు పూర్తిస్ధాయిలో మద్దతు ఇచ్చేవారు. ఆ విషయాన్ని చంద్రబాబు వ్యతిరేక వర్గం ఎప్పటికప్పుడు పార్టీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేస్తోంది. వెంకయ్య ఉపరాష్ట్రపతి అయిన తర్వాత వ్యతిరేక వర్గం పుంజుకున్నది.

ఈనేపధ్యంలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపద్యంలో కేంద్ర-చంద్రబాబు మధ్య సంబంధాలు బాగా క్షీణించాయి. అందుకనే బిజెపి-టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్ధాయిలో జరుగుతోంది.  ఈ నేపధ్యంలోనే ఆదివారం బిజెపి నేతల కీలక సమావేశం జరిగింది. చంద్రబాబు, టిడిపి నేతలు బిజెపి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కొందరు నేతలు చేసిన ప్రతిపాదనను హరిబాబు అడ్డుకున్నారు. దాంతో నేతలు రెచ్చిపోయారు,

అసలు బిజెపి పరిస్దితికి హరిబాబే కారణమంటూ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. మూడున్నరేళ్ళపాటు బిజెపిలో ఉంటు కొందరు టిడిపికి మద్దతుగా నిలవటం వల్లే పార్టీ ఏపిలో దెబ్బతిన్నట్లు ధ్వజమెత్తారు. ప్రధానమంత్రిని చంద్రబాబు, టిడిపి నేతలు విమర్శిస్తున్నా బిజెపి ధీటుగా సమాధానం చెప్పలేకపోతోందని నేతలు హరిబాబుపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. జిల్లాల వారీగా చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కిందో రాష్ట్ర ప్రజలకు వివరించాలని నేతలు చేసిన ప్రతిపాదనను హరిబాబు అంగీకరించలేదు.

దాంతో నేతలు లక్ష్మీపతిరాజు, సన్యాసిరాజు హరిబాబుపై మండిపడ్డారు. వారికి పురంధేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి, మంత్రి మాణిక్యాలరావు, ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు మద్దతుగా నిలిచారు. దాంతో ఒక్కసారిగా పలువురు నేతలు హరిబాబుపై విరుచుకుపడ్డారు. దాంతో హరిబాబు వర్గం బిత్తరపోయింది. హరిబాబు వైఖరి వల్లే బిజెపి ఇబ్బందుల్లో పడుతోందంటూ కేకలేసారు. దాంతో రెండు వర్గా మధ్య తీవ్రస్యిలో వాగ్వాదం జరిగింది. వ్యతిరేక వర్గం హరిబాబుపై బహిరంగంగానే తిరుగుబాటు చేసినట్లైంది. నివురుగప్పిన నిప్పులాగున్న నేతల మధ్య విభేదాలు బయటపడటంతో పరిస్దితులు ఎంతదాకా వెళుతుందో అర్ధం కావటం లేదు.