బ్రేకింగ్ న్యూస్: చంద్రబాబు అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు

First Published 23, Feb 2018, 10:04 AM IST
Bjp leaders complaints chandrababus corruption to national leadership
Highlights
  • ప్రాజెక్టుల అమలులో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని బిజెపి నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే.

చంద్రబాబునాయుడు అవినీతి గురించి భారతీయ జనతా పార్టీ నేతలు జాతీయ నాయకత్వంతో పాటు కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సమాచార. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులు, ప్రాజెక్టుల అమలులో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని బిజెపి నేతలు ఎప్పటి నుండో ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆరోపణలను టిడిపి నేతలు కొట్టేస్తున్నారనుకోండి అది వేరే సంగతి.

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత రెండు పార్టీల మధ్య వివాదం తారాస్ధాయికి చేరుకుంది. బడ్జెట్ కు ముందు వరకూ బిజెపి నేతలు తమ ఆరోపణలను తెరవెనుక నుండే చేశేవారు. బడ్జెట్ తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో ఏకంగా మీడియా సమావేశాల్లోను, టివి చర్చల్లోనే చంద్రబాబు అవినీతిపై బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు.

ఇటువంటి పరిస్దితుల్లో ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి వీడియో, ఆడియో టేపులు బిజెపి నేతలకు లడ్డూల్లాగ దొరికాయి. జమ్మలమడుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, తన సంపాదనలో ఎవరెవరికి ఎంతెంత వాటాలు పంచుతున్నది స్పష్టంగా చెప్పారు. వాటల పంపిణీలో చంద్రబాబు చేసిన పంచాయితీ, ఐఏఎస్ అధికారుల సాక్ష్యాలుగా ఉన్న విషయంపై మంత్రి చెప్పిన మాటలు దుమారాన్నే రేపుతోంది.

మంత్రి చేసిన వ్యాఖ్యలపై సహచర మంత్రులు కానీ ఎంఎల్ఏలు, ఎంపిలు, నేతలు నోరు విప్పటం లేదు. దాన్ని అవకాశంగా తీసుకున్న బిజెపిలోని కొందరు నేతలు మంత్రి వీడియో, ఆడియో టేపులను జాతీయ నాయకత్వానికి పంపారట. ఇంతకాలం చంద్రబాబుపై చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఆధారాలుగా  ఫిరాయింపు మంత్రి వ్యాఖ్యలను అమిత్ షా ముందుంచారట.

అంతేకాకుండా ఫిర్యాదు కాపీలను ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కీలకమైన మంత్రులు, నేతలకు కూడా అందచేశారని బిజెపిలో చెప్పుకుంటున్నారు. ‘ఓటుకునోటు’ కేసు నుండి బయటపడలేకే చంద్రబాబు నానా అవస్తలు పడుతున్నారు. అటువంటిది ఆ కేసుకు తాజాగా ఫిరాయింపు మంత్రి చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు మరింత ఇబ్బందుల్లో పడినట్లైంది.

 

loader