ఉండవల్లి గారు .. మీరు ఊసరవల్లిగా మారవద్దు.. అంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బిజేపీలో ఎందుకు చేరాలి? ఎందుకు చేరకూడదు? చేరే వాళ్లకు తెలుసు అంటూ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. 

రాజకీయ అస్త్ర సన్యాసం చేసిన మీలాంటి వారి సలహాలు బీజేపీలో చేరాలనుకున్న వారు ఎందుకు తీసుకుంటారు. మీ భ్రమ తప్ప... మీరు ఎవరికోసం మాట్లాడుతున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఏ పార్టీని బతికించాలి? అని తాపత్రయ పడుతున్నారో దాని వెనుక ఉన్న రహస్యం రాష్ట్ర ప్రజలకు తెలుసని చెప్పుకొచ్చారు.

ఆర్ఎస్ఎస్ గురించి మీరు చాలా విమర్శలు చేశారు. మీరు నమ్మి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ మీ మాజీ ప్రధాని నెహ్రూ గారు 1963 జనవరి 26 న ఆర్ఎస్ఎస్ ను స్వాతంత్ర దినోత్సవ వేడుకల పెరేడ్ లో ఆహ్వానించారు. 

మీకే చరిత్ర తెలిసినట్లు 80 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆర్ఎస్ఎస్ గురించి నేడు మీరు వక్రీకరించి హేళనగా మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ ప్రేరణతో నేడు అత్యున్నతమైన రాష్ట్రపతి,ఉప రాష్ట్రపతి, ప్రధాని లాంటి పదవులలో దేశం కోసం పనిచేస్తున్నారు. మేధావులు కదా ఈ చరిత్ర తెలియదా? తెలియకపోవచ్చులే. మనం మేధావి ముసుగులో ఉన్నాం కదా! ' అంటూ చురకలంటించారు.