గుంటూరు: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి నేత సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు రెండేళ్లలో జైలుకు వెళ్లక తప్పదని ఆయన అన్నారు. శనివారంనాడు గుంటూరు జిల్లాలోని వెంగళాయపాలెంలో జరిగిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

చంద్రబాబు ప్రభుత్వం చేసిన అవినీతిపై విచారణ చేపట్టాల్సిన భాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై వుందని దేవధర్ అన్నారు. చంద్రబాబు అవినీతి రుజువైతే రెండేళ్ళలో జైలుకెళ్తారని అన్నారు. కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంటిని జగన్ ఖాళీ చేయిస్తే ఆ ఇంటిని వదిలి చంద్రబాబు వెళ్ళేది జైలుకేనని ఆయన అన్నారు.
 
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీ స్థాపించారని, ఏపీలో ఎన్టీఆర్ బాహుబలిలా వుంటే చంద్రబాబు కట్టప్పలా వెనుక వుండి వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు. చంద్రబాబు.. చందాలబాబులా మారారని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కోసం కేంద్రం నిధులు ఇస్తే చంద్రబాబు ఆ నిధులలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దళితుల అభివృద్ధికి కృషి చేయడం నచ్చక రావెల కిశోర్ బాబును మంత్రి పదవి నుంచి తొలగించారని అన్నారు. 

చాలా మంది టీడీపీ నేతలు మాతో టచ్‌లో ఉన్నారని దేవ్‌ధర్‌అన్నారు. టీడీపీ నేతలు బీజేపీలో పెద్ద సంఖ్యలో చేరడానికి సిద్దంగా ఉన్నారన్నారని ఆయన అన్నారు.