జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ విషయంలో బీజేపీ  స్వరం మారుస్తోందా? ఆ పార్టీ నేత పురందేశ్వరి మాటలు వింటే.. నిజమేననిపిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. దీంతో ఏపీలో పొత్తుల వ్యవహారం ఉత్కంఠ గా మారింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పైనే అందరి దృష్టి ఉంది. ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు అన్ని పార్టీలు ఉవ్విళూరుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి బీజేపీ కూడా వచ్చి చేరింది. అయితే.. జనసేన రూటెటు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

గత ఎన్నికల్లో పవన్.. టీడీపీ- బీజేపీ పొత్తుకి మద్దతుగా నిలిచాడు.  టీడీపీ-బీజేపీ మిత్ర పక్షం అధికారంలోకి రావడానికి పవనే కారణమంటూ వార్తలు కూడా వెలువడ్డాయి. అయితే.. పవన్ మాత్రం ఒకవైపు చంద్రబాబుతో సన్నిహితంగా వ్యవహరిస్తూనే మరోవైపు రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ప్రకటించాడు. అంతేకాదు..రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు బలం ఎక్కువగా ఉన్న అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని కూడా చెప్పాడు..

పవన్ తాజా ప్రకటనతో టీడీపీ నేతల్లో గందరగోళం మొదలైంది.  పవన్ తో పొత్తు విషయంలో టీడీపీ నేతల్లోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. మరో వైపు రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో వైసీపీతో కలిసి  పోరాటం చేయడానికైనా తాము సిద్ధమని ఇటీవల జనసేన మీడియా హెడ్ హరిప్రసాద్ తెలిపారు. దీంతో వైసీపీతో పొత్తు పెట్టుకోవడం ఖాయం అంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా... ఈ విషయంలో బీజేపీ నేత పురందేశ్వరి సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించారు. పవన్ కళ్యాణ్ తమకు మొదటి నుంచీ మిత్రుడేనని ఆమె చెప్పారు. పొత్తుకు తామెప్పుడు సిద్ధంగానే ఉంటామని, ఎవరితో కలసి వెళ్లాలన్న విషయమై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణేనని స్పష్టం చేశారు. మొన్నటి వరకు పవన్ తో ఏ సంబంధం లేన్నట్లు వ్యవహరించిన బీజేపీ నేతలు..ఇప్పుడు స్వరం మార్చి మాట్లాడుతున్నారు. టీడీపీతో పొత్తుకు రాష్ట్రంలోని చాలా మంది బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే భావన బీజేపీ నేతల్లో మొదలైనట్లు తెలుస్తోంది. అందుకే పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగునున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది.