విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు... ప్రత్యమ్నాయాలను కూడా సూచించినట్లు మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి తెలిపారు.
విశాఖపట్నం: కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని ఏపీ ప్రజలతో పాటు అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ విభజనకు మద్దతివ్వడం, విభజన హామీలను నెలవేర్చకపోవడంతో ఇప్పటికే కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి పై ఏపీ ప్రజలు గుర్రుగా వున్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేవేటీకరణ (vizag steel plant privatisation) నిర్ణయంతో బిజెపి ఏపీ ప్రజలకు మరింత దూరమయ్యే ప్రమాదముందని గుర్తించిన ఏపీ బిజెపి నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపి ఆ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకుని ఏపీ ప్రజల విశ్వాసాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మాజీ కేంద్ర మంత్రి, ఏపీ బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (daggubati purandareshwari) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇప్పటికే కేంద్రంతో చర్చించినట్లు... ప్రత్యామ్నాయ మార్గాలను అగ్రనాయకత్వం ముందుంచినట్లు తెలిపారు. తన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర వెనక్కి తీసుకుంటుందని నమ్ముతున్నట్లు పురందేశ్వరి పేర్కొన్నారు.
ఇక ఏపీలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారీ నీటిపారుదల ప్రాజెక్ట్ పోలవరం నిర్మాణానికి కేంద్రం అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని పురంధేశ్వరి పేర్కొన్నారు. పోలవరం (polavaram project) ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కారణం కాదన్నారు. టీడీపీ (TDP) హయాంలోనే పనులు నత్తనడకన సాగాయని పురంధేశ్వరి ఆరోపించారు.
పోలవరానికి ప్రతిపైసా కేంద్రం నుంచే వస్తోందని... బిల్లుల విషయంలో ఏవైనా అనుమానాలుంటే ఆలస్యమవుతోందన్నారు. పోలవరానికి అన్యాయం చేసే ఎలాంటి నిర్ణయం కేంద్రం తీసుకోదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చింది కేంద్రమేనని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి గుర్తుచేసారు.
కేంద్ర ప్రభుత్వం రుణ భారం అధికం కావడంతో పాటు అప్పుల్లోకి జారుకుంటున్నాయనే కారణాలు చూపుతూ తమ ఆధీనంలోని పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీ ప్రజలు ఎన్నో ఉద్యమాల ఫలితంగా సాధిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరించాలని నిర్ణయించింది. ఆ దిశగా చర్యలు కూడా చేపట్టింది.
అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదిస్తూ స్టీల్ ప్లాంట్ కార్మికులు, రాష్ట్ర ప్రజలు పోరాటం సాగిస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిరసిస్తూ ఉద్యమిస్తున్నారు. వెంటనే కేంద్రం ఈ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
కేవలం కార్మికులు, ప్రజలే కాదు ఏపీలోని అధికార వైసిపి (ysrcp), ప్రతిపక్ష టిడిపి (TDP), జనసేన పార్టీ, వామపక్షాలు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఏపీ బిజెపి నాయకులు ఇరుకున పడ్డారు. సొంత పార్టీకి చెందిన ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టలేక... అలాగని ప్రజలు వ్యతిరేకిస్తున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఒప్పుకోలేకపోతోంది. దీంతో కేంద్రాన్ని ఒప్పించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని ఏపీ బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారు.
