అమరావతి: ఏపీలో తామే ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించనున్నట్టు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు చెప్పారు. వైఎస్ఆర్‌సీపీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల తరపున ప్రశ్నిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఆదివారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వానికి తాము ఆరు మాసాల సమయం ఇస్తున్నామని చెప్పారు.

ఏపీలో తమ పార్టీనే ప్రతిపక్షపాత్రను పోషించే అవకాశం ఉందన్నారు.ఈ విషయాన్ని టీడీపీ నేతలు కూడ విశ్వసిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.  ఏపీ రాష్ట్రాభివృద్దికి  తమ పార్టీ కట్టుబడి ఉందని  ఆయన చెప్పారు.

ఏపీ రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో కూడ తమ పార్టీలోకి  ఇతర పార్టీల నుండి  నేతలు చేరనున్నారని ఆయన చెప్పారు. రానున్న కాలం బీజేపీదేనని చాలా మంది నేతలు విశ్వాసంతో ఉన్నందున తమ పార్టీలో చేరుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

భవిష్యత్తులో తమ పార్టీ వేసే బాణాలు వైసీపీకి తగులుతాయని ఆయన స్పష్టం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో బలోపేతం కావడం కోసం తమ పార్టీ నాయకత్వం అన్ని రకాల ప్రయత్నాలను చేస్తోందని ఆయన వివరించారు.