జగన్ ప్రభుత్వ అప్పులపై బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని ఆయన ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు వచ్చినా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో వుందని దినకర్ చురకలు వేశారు.
వైసీపీ ప్రభుత్వం ఏపీని అప్పుల్లో ముంచేసిందని బీజేపీ నేత లంకా దినకర్ (lanka dinakar) విమర్శలు గుప్పించారు. ఈ మూడేళ్ల కాలంలో రూ. 8 లక్షల కోట్లు అప్పు చేసింది నిజమా? కాదా? అని ఆయన ప్రశ్నించారు. 2020-21లో పరిమితికి మించి అప్పులు చేసినందుకే... కొత్త అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 17,923 కోట్లకు కోత పెట్టిందని దినకర్ పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణ అనేది నిబంధనల మేరకే జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మూడేళ్లలో రూ. 30 వేల కోట్ల ఉపాధి హామీ నిధులు రాష్ట్రానికి వచ్చాయని... అయినా రోడ్లపై గుంతలను కూడా పూడ్చలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఏపీలో ఉందని దినకర్ దుయ్యబట్టారు. పీఎంఏవై కింద పేదలకు 20 లక్షలకు పైగా ఇళ్లను మంజూరు చేస్తే... రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఇళ్లను నిర్మించడం లేదని ఎద్దేవా చేశారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను కూడా పేదలకు ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మత మార్పిళ్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారని లంకా దినకర్ నిలదీశారు. తప్పుడు కేసులు, భౌతిక దాడులతో ఇబ్బంది పెడుతున్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. రివర్స్ పాలనతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోతున్నారని దినకర్ చురకలు వేశారు. పోలవరం ప్రాజెక్టు గురించి ఈ రోజు వరకు జగన్ ఒక్క నిజమైనా మాట్లాడారా? అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనకు వెళ్లిన జగన్ పెట్టుబడులను ఆకర్షించలేక వట్టి చేతులతో తిరిగొచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని లంకా దినకర్ డిమాండ్ చేశారు.
ALso Read:మేం అప్పులు చేస్తుంటే.. కేంద్రం ఏం చేస్తోంది, మీకు తెలియకుండానేనా : జేపీ నడ్డాకి పేర్ని నాని కౌంటర్
ఇకపోతే.. మంగళవారం రాజమండ్రిలో (rajamahendravaram) జరిగిన గోదావరి గర్జన (bjp godavari gharjana) సభలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై (ysrcp govt) బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda) చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని (perni nani) . వేదికపై జేపీ నడ్డా నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆయన మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ (polavaram project) గురించి ఒక్క మాటైనా చెప్పారా అని నాని ప్రశ్నించారు. పోలవరం పెండింగ్ బిల్లులు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ఆయన నిలదీశారు. ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతోంది ఎవరని పేర్ని నాని చురకలు వేశారు. ఏపీ అప్పులపై నడ్డా చెప్పింది అంతా తప్పేనని.. 130 లక్షల కోట్లకు దేశ అప్పును తీసుకుని వెళ్లింది ఎవరంటూ ఆయన ధ్వజమెత్తారు.
నడ్డా ఏపీకి వచ్చే ముందు ఆర్ధిక మంత్రిని అడిగి వివరాలు తీసుకుని వస్తే బాగుండేదంటూ నాని సెటైర్లు వేశారు. తాము పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్రం ఏం చేస్తోందని ఆయన నిలదీశారు. మోడీకి, ఆర్ధిక మంత్రికి తెలియకుండా అప్పులు తీసుకున్నామా అంటూ పేర్ని నాని చురకలు వేశారు. ఆయుష్మాన్ భారత్ కింద పెట్టే రూల్స్ అమలు చేస్తే ఏపీలో ఒక్కరికీ ఆరోగ్యశ్రీ రాదని ఆయన ఆరోపించారు. దేశంలో మతం పేరుతో తన్నుకునేలా విధ్వంస రాజకీయాలు చేస్తోంది మీరు కాదా అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
అంతకుముందు బీజేపీ (bjp) జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. మోడీ (narendra modi) హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకెళ్తోందన్నారు. మోడీ దేశంలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నారని జేపీ నడ్డా అన్నారు. దేశ సంస్కృతిని మోడీ మారుస్తున్నారని నడ్డా పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద హెల్త్ కవరేజ్ అయిన ఆయుష్మాన్ భవ కార్యక్రమం ద్వారా కోట్లాది మందికి సాయం చేస్తున్నారని... అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ ద్వారా కరోనాను నియంత్రించారని నడ్డా గుర్తుచేశారు. దేశంలో ఎయిమ్స్ సంఖ్యను మోడీ పెంచారని ఆయన పేర్కొన్నారు.
