Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ అన్నం పెడితే.. జగన్ పొట్టకొడుతున్నాడు, చంద్రబాబు వల్లే బీజేపీ... కన్నా కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని కన్నా ధీమా వ్యక్తం చేశారు. రాజన్న పాలన తెస్తామంటూ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ, జనసేనల నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.

bjp leader kanna lakshmi narayana comments on jagan and chandrababu
Author
Hyderabad, First Published Jul 29, 2019, 12:34 PM IST

దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టారని... కానీ ఆయన కుమారుడు సీఎం జగన్ మాత్రం ప్రజల పొట్టగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అనంతపురంలో నిర్వహించారు. 

ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని కన్నా ధీమా వ్యక్తం చేశారు. రాజన్న పాలన తెస్తామంటూ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు.  రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ, జనసేనల నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని... ఆ విషయంలో  చంద్రబాబు చేసిన జాప్యం వల్లే అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ వెనుకబడిందని చెప్పారు.  

అనంతరం కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మాట్లాడుతూ... బీజేపీలో చేరడానికి అన్ని పార్టీల నేతలు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. టీడీపీ నుంచి రాబోయే కాలంలో ఇంకొంత మది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరనున్నారని చెప్పారు. టీడీపీ ఇప్పుడు చచ్చిన పాములాంటిదని అభిప్రాయపడ్డారు. గోదావరి జలాలను తెలంగాణకు తరలించాలన్న ప్రతిపాదన బాగున్నప్పటికీ.. ఏపీ నష్టం జరిగితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios