బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు మరోసారి చంద్రబాబు,లోకేష్ లపై మండిపడ్డారు. హైకోర్టు విభజన విషయం, విశాఖలో ఎయిర్ షో రద్దు చేయడంపై చంద్రబాబు, లోకేష్ లు కేంద్ర ప్రభుత్వంపై మండిపడిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై జీవీఎల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

చంద్రబాబు యూటర్న్ సీఎం అంటూ ఎద్దేవా చేశారు. హైకోర్టు విభజన విషయంలోనూ చంద్రబాబు ప్లేటు మార్చారని మండిపడ్డారు. విభజన చట్టం అమలులో భాగంగా కేంద్రం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్  హైకోర్టుకు సహకరిస్తే.. నీచంగా రాజకీయం ఆపాదిస్తున్నారన్నారు.

హైకోర్టు విభజన విషయంలో క్రెడిట్ అంతా తమదేనని నిన్నటికినిన్న ఎంపీ కె రవీంద్ర కుమార్ డబ్బా కొట్టుకున్నారని గుర్తు చేశారు. అందుకే టీడీపీ నేతలను మీ ‘‘బతుకులు చెడ’’ అని కేసీఆర్ ఊరికే అనలేదన్నారు.

మరో ట్వీట్ లో విశాఖ ఎయిర్ షో రద్దుపై స్పందించారు. ‘‘లోకేష్ బాబు, మీరు మీ నాన్న గారు ప్రతి ఉదయం "చచ్చు డ్రామాలు" ఆడటం మానేస్తే మంచిది. ఎవరు ఎయిర్ షోకు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు క్యాన్సిల్ చేసారు? దొంగ డ్రామాలు ఆపండి. ఎన్ని వేషాలు వేసినా మీకు ఓటమి తప్పదు. తెలంగాణ లో ఫెయిల్ అయిన వ్యూహాన్నే ఆంధ్రలో అమలు చేస్తున్న మీ తెలివితేటలు అమోఘం’’ అంటూ ట్వీట్ చేశారు.