దివంగత ఎన్టీఆర్‌పై మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలపై ఆయన కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భగ్గుమన్నారు. ఎన్టీఆర్ అంటే గౌరవం వుందని చెప్పే సీఎం జగన్.. దాడిశెట్టి రాజాపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలకతీతంగా జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఈ క్రమంలో మంత్రి దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్టీఆర్‌కు, వైఎస్సార్‌కు పోలికే లేదని.. ఎన్టీఆర్ అంత చేతకానివాడు భారతదేపశం మొత్తం మీద ఇంకెవరూ లేరని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒకసారి నాదెండ్ల భాస్కర్‌రావుతో, మరోసారి అల్లుడు చంద్రబాబుతో ఎన్టీఆర్ వెన్నుపోటు పోడిపించుకున్నారంటూ దాడిశెట్టి కామెంట్స్ చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి భగ్గుమన్నారు. ఎన్టీఆర్ అంటే గౌరవం వుందని చెప్పే సీఎం జగన్.. దాడిశెట్టి రాజాపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఒకవేళ ఆ మంత్రిపై చర్యలు తీసుకోకుంటే మీ అభిప్రాయం కూడా ఇదేనా అని దగ్గుబాటి పురందేశ్వరి నిలదీశారు.
Also REad:చంద్రబాబును క్షమించమని నేను ఆనాడూ ఎన్టీఆర్‌ను కోరాను.. లక్ష్మీపార్వతి
అంతకుముందు గత గురువారం పురందేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌పై గౌరవం వుందని చెబుతూనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో పేర్లు మార్చినా చాలా వరకు రామారావు ప్రవేశపెట్టిన పథకాలే అమలవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కారణం లేకుండా పేరు మార్చడం ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని పురందేశ్వరి దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం లేదని మండిపడ్డారు. ఏ ప్రభుత్వంపైనా లేని కేసులు జగన్ సర్కార్‌పై వున్నాయని.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై సెప్టెంబర్ 21న ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ మనస్తాపం చెందారు. తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్సిటీకి వైఎస్సార్ పేరు పెట్టడం సరికాదని చెప్పారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం అంత సరైన నిర్ణయం కాదని అన్నారు. దీంతో మనస్తాపంతోనే తాను రాజీనామా చేస్తున్నానన్నారు.
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇస్తానని అప్పటి ప్రధాని వాజ్‌పేయి చెబితే చంద్రబాబు నాయుడు వద్దన్నారని చెప్పుకొచ్చారు. క్రెడిట్ లక్ష్మీ పార్వతికి వస్తుందని ఆనాడు చంద్రబాబు దీనికి ఒప్పుకోలేదని తెలిపారు. మరోవైపు ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై వైసీపీకి మద్దతుగా ఉన్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అభ్యంతరం వ్యక్తం చేశారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలని తెలిపారు. ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని.. అలాగే హెల్త్ యూనివర్సిటీ పేరును కూడా కొనసాగించాలని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మారుస్తూ అసెంబ్లీలో జగన్ సర్కార్ తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
