Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ అంటే గౌరవముంటే.. ఇలాగేనా చేసేది : హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పురందేశ్వరి ఫైర్

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై స్పందించారు రామారావు కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి. ఎన్టీఆర్‌పై గౌరవం వుందని చెబుతూనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదన్నారు.

bjp leader daggubati purandeswari slams ap cm ys jagan over ntr health university name change
Author
First Published Sep 22, 2022, 7:47 PM IST

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు పలు పార్టీలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. అలాగే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు కూడా చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. అటు ఎన్టీఆర్ కుటుంబం కూడా ఘాటుగానే స్పందించింది. తాజాగా అన్నగారి కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. 

గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌పై గౌరవం వుందని చెబుతూనే హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదన్నారు. రాష్ట్రంలో పేర్లు మార్చినా చాలా వరకు రామారావు ప్రవేశపెట్టిన పథకాలే అమలవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. కారణం లేకుండా పేరు మార్చడం ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని పురందేశ్వరి దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన వాతావరణం లేదని మండిపడ్డారు. ఏ ప్రభుత్వంపైనా లేని కేసులు జగన్ సర్కార్‌పై వున్నాయని.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. 

ALso Read:అలా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూ. ఎన్టీఆర్

మరోవైపు ఈ పరిణామంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని అన్నారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరు పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలు చెరిపివేయలేరని అన్నారు. 

ఇక, హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఖండిస్తున్నామని ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చెప్పారు. ఇదొక దురదృష్టకరమైన పరిణామమని పేర్కొన్నారు. హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రెస్‌ నోట్ విడుదల చేశారు. హెల్త్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అని గుర్తుచేశారు. 1986లో ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీని స్థాపించారని తెలిపారు. నాడు ప్రజలు, పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. నందమూరి తారకరామా రావు గారు 1996 లో మరణించారని తెలిపారు.  ఎన్టీఆర్ మరణించిన తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు పెట్టారని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద గౌరవంతో డాక్టర్ ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ వర్సిటీగా నామకరణం చేశారని చెప్పారు. ఆ పేరును‌ నేడు జగన్ మార్చడం దురదృష్టకరమని పేర్కొన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios