విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఇవాళ(గురువారం) జనసేన, భారతీయ జనతా పార్టీ నేతల బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో మొదలైన స్థానిక ఎన్నికల ప్రక్రియ విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిని గవర్నర్ దృష్టికి ఈ బృందం తీసుకువెళ్ళింది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు  నేతృత్వంలో ఇరు పార్టీల నేతలు రాజ్ భవన్ కు వెళ్ళారు.

వీడియో

ఈ సందర్భంగా జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి గవర్నర్ కు వివరించామన్నారు. గతంలో కనీసం నామినేషన్ లు కూడా వేయకుండా అధికార పార్టీ అడ్డుకుందని...ఈసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని గవర్నర్ ని కోరామని తెలిపారు.  ఏకగ్రీవాలు సహజమే అయినా... ప్రలోభపెట్టి, భయపెట్టి చేయాలని చూస్తున్నారని గవర్నర్ కు తెలిపామన్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన ఘటనల గురించి కూడా వివరించామన్నారు.

read more  మా కార్యకర్తలపై అక్రమ కేసులు: గవర్నర్‌కి బీజేపీ,జనసేన ఫిర్యాదు

''తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇంకా ఇవ్వలేదు. ఆలయాలపై జరుగుతున్న దాడుల గురించి కూడా వివరించాం. అలాగే వాలంటీర్ ల ద్వారా అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. ఎన్నికల కమిషన్ కు అధికార యంత్రాంగం సహకరించాలి. అన్ని వ్యవస్థ లు కూడా ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించేలా చూడాలి'' అని గవర్నర్ ను కోరినట్లు నాదెండ్ల తెలిపారు.