Asianet News TeluguAsianet News Telugu

తిరుపతి కోసం బీజేపీ-జనసేన స్కెచ్‌... తెరపైకి జగన్ కేసుల్లో ఉన్న మాజీ సీఎస్‌... !

తిరుపతి ఉప ఎన్నికల కోసం బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఓవైపు ప్రత్యర్ధులు వైసీపీ, టీడీపీ అనుభవం, స్ధానబలం, అధికార బలం వంటి కారణాలతో అభ్యర్దులను ఎంపిక చేస్తే, వారికి గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ-జనసేన సిద్ధమవుతున్నాయి. దీనికోసం కొత్త అభ్యర్ధిని తెరపైకి తెస్తున్నాయి. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి, టీడీపీ అభ్యర్ధి పనబాకకు గట్టి పోటీ ఇచ్చే వారి కోసం ఇప్పటికే పలు సమీకరణాలను పరిశీలించిన ఇరుపార్టీలు ఇప్పుడు మరో కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

bjp janasena considering former karntaka cs ratnaprabha candidature for tirupati bypolls, andhrapradesh - bsb
Author
Hyderabad, First Published Jan 26, 2021, 1:34 PM IST

తిరుపతి ఉప ఎన్నికల కోసం బీజేపీ-జనసేన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. ఓవైపు ప్రత్యర్ధులు వైసీపీ, టీడీపీ అనుభవం, స్ధానబలం, అధికార బలం వంటి కారణాలతో అభ్యర్దులను ఎంపిక చేస్తే, వారికి గట్టిపోటీ ఇచ్చేందుకు బీజేపీ-జనసేన సిద్ధమవుతున్నాయి. దీనికోసం కొత్త అభ్యర్ధిని తెరపైకి తెస్తున్నాయి. వైసీపీ అభ్యర్ధి గురుమూర్తికి, టీడీపీ అభ్యర్ధి పనబాకకు గట్టి పోటీ ఇచ్చే వారి కోసం ఇప్పటికే పలు సమీకరణాలను పరిశీలించిన ఇరుపార్టీలు ఇప్పుడు మరో కొత్త ఆప్షన్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తిరుపతిలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో అనివార్యంగా మారిన ఉపఎన్నికకు త్వరలో నోటిఫికేషన్‌ వెలువడబోతోంది. ఇందుకోసం అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీతో పాటు మరో ప్రతిపక్ష కూటమి బీజేపీ-జనసేన కూడా సిద్ధమవుతున్నాయి. వీరిలో అందరి కంటే ముందే టీడీపీ అభ్యర్ధిని ప్రకటించగా, ఆ తర్వాత వైసీపీ కూడా తన అభ్యర్థిని ఖరారు చేసింది. 

తిరుపతి ఉప ఎన్నికల్లో క్షేత్రస్దాయిలో బలంగా కనిపిస్తున్న వైసీపీ, టీడీపీకి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్ధి కోసం బీజేపీ-జనసేన కూటమి రెండు నెలలుగా తీవ్రంగా అన్వేషణ చేస్తోంది. ఇందులో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబుతో పాటు మాజీ బ్యూరోక్రాట్‌ దాసరి శ్రీనివాస్‌ పేరు కూడా వినిపించాయి. వీరిద్దరిలో ఒకరికి అవకాశం దక్కడం ఖాయమే అనుకున్నారు.

కానీ గురుమూర్తి, పనబాకకు గట్టి పోటీ ఇవ్వాలంటే వీరు కూడా సరిపోరనే అంచనాకు ఇరుపార్టీలు వచ్చాయి. దీంతో మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. తిరుపతి ఉపఎన్నికను ముక్కోణపు పోరుగా మార్చాలంటే ఆ అభ్యర్ధి అయితేనే మంచిదని ఇరుపార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తిరుపతి ఉపఎన్నికల కోసం బీజేపీ-జనసేన అభ్యర్ధిగా కర్నాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ పేరు బలంగా వినిపిస్తోంది. 1981 కర్నాటక క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన రత్నప్రభ.. మధ్యలో ఏపీలోనూ పనిచేశారు. కెరీర్‌ చివర్లో సొంత క్యాడర్ కర్నాటకకు వెళ్లి సీఎస్‌గా నియమితులయ్యారు. సీఎస్‌గా రిటైర్మంట్‌ అనంతరం బీజేపీలో చేరారు. 

ఇప్పుడు కర్నాటక బీజేపీలో కీలక నేతల్లో ఒకరిగా ఆమెకు గుర్తింపు కూడా ఉంది. దీంతో రత్నప్రభను తిరుపతి ఉపఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రతిపాదిస్తోంది. దీనికి జనసేన కూడా నో చెప్పే అవకాశాలు లేనట్లే అని చెప్తున్నారు. ఫైర్‌ బ్రాండ్‌ అధికారిగా, నేతగా పేరుతెచ్చుకున్న రత్నప్రభ అయితేనే వైసీపీ, టీడీపీకి గట్టిపోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు.

గతంలో సీఎం జగన్ తండ్రి వైఎస్సార్‌ హయాంలో డిప్యుటేషన్‌పై ఏపీ క్యాడర్‌కు వచ్చిన ఐఏఎస్‌ రత్నప్రభ పలు హోదాల్లో పనిచేశారు. అదే సమయంలో వైఎస్‌ జగన్ అక్రమాస్తుల కేసులో ఇందూటెక్‌ జోన్‌కు అనుమతులు ఇచ్చిన వ్యవహారంలో రత్నప్రభపై సీబీఐ ఛార్జిషీట్‌ నమోదు చేసింది. అయితే దీన్ని హైకోర్టులో సవాల్‌ చేసి ఆమె క్లీన్‌ చిట్‌ తెచ్చుకున్నారు. వైఎస్‌ మరణం తర్వాత తిరిగి కర్నాటక క్యాడర్‌కు వెళ్లిపోయిన ఆమె సీనియారిటీ ప్రకారం అక్కడ సీఎస్‌ కూడా అయ్యారు. 

యడ్యూరప్ప సర్కారులో సీఎస్‌గా పనిచేసిన రత్నప్రభ.. రాష్ట్రంలో దళితుల కోసం పలు చట్టాలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దీంతో ఆమె బీజేపీ సర్కారుకూ దగ్గరయ్యారు. సీఎస్‌గా రిటైరయ్యాక మూడు నెలలు పొడిగింపు కూడా పొందారు. అనంతరం బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు రత్నప్రభను రంగంలోకి దింపడం ద్వారా వైసీపీని ఇరుకున పెట్టొచ్చని బీజేపీ-జనసేన అంచనా వేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios