అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి ఏ మాత్రం ప్రభావం చూపలేదు.కొన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్ధులు విజయం సాధించారు. కానీ బీజేపీకి ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు మాత్రం దక్కలేదు.

గత ఎన్నికల తర్వాత బీజేపీ, జనసేనలు కూటమిగా ఏర్పడ్డాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు  ప్రతి ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఆ పార్టీలు ప్రకటించాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమి పోటీ చేసింది. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జనసేన కొంత ప్రభావాన్ని చూపింది. మున్సిపల్ ఎన్నికల్లో కూడ ఆ పార్టీ ఈ ప్రభావాన్ని కొనసాగించింది.

తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల్లో జనసేన అభ్యర్ధులు విజయం సాధించారు. విశాఖ కార్పోరేషన్ లో కూడ జనసేన అభ్యర్ధులు గెలుపొందారు. బీజేపీ అభ్యర్ధులు ఏ మాత్రం ప్రభావం చూపలేదు.

త్వరలోనే  తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం పరిధిలో బీజేపీకి ఒక్క స్థానం కూడ దక్కలేదు. జనసేన అభ్యర్ధి ఒక్క స్థానంలో విజయం సాధించారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ, జనసేన కూటమి ప్రయత్నాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ఈ కూటమికి  ఆశించినట్టుగా లేవనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని తరలింపు అంశంతో పాటు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహరం కూడ ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే అర్ధమౌతోంది. విశాఖలోని 20 డివిజన్లలో స్టీల్ ప్లాంట్ కొంత ప్రభావం చూపింది.