కన్నాకు బీజేపీ నాయకత్వం ఫోన్: భారీగా లక్ష్మీనారాయణ ఇంటికి అనుచరులు
బీజేపీ నాయకత్వం బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణకు గురువారంనాడు ఫోన్ చేసింది. పార్టీ విషయాలపై మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించింది. పార్టీ ఆదేశాలను శిరసావహిస్తానని కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.
గుంటూరు: బీజేపీ అధిష్టానం గురువారంనాడు ఆ పార్టీ ఏపీ కీలక నేత కన్నా లక్ష్మీనారాయణకు పోన్ చేసింది. మీ వాదన తమ దృష్టికి వచ్చిందని బీజేపీ నాయకత్వం తెలిపింది. పార్టీ అంతర్గత వ్యవహరాలపై మాట్లాడొద్దని కన్నా లక్ష్మీనారాయణకు అధిష్టానం సూచించింది.పార్టీ అధిష్టానం సూచనలను పాటిస్తానని కన్నా లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల క్రితం బీజేపీ నాయకత్వంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ అంటే తనకు గౌరవం ఉందన్నారు.కానీ, బీజేపీకి ఊడిగం చేయలేనన్నారు. అంతేకాదు తమ రాజకీయ వ్యూహం కూడా మార్చుకొంటామని చెప్పారు.బీజేపీపై తన అసంతృప్తిని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లో వ్యక్తమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో సమన్వయం చేసుకోవడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. సోము వీర్రాజు అన్నీ తానై వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ఆరోపంచారు. ఈ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించేందుకు నిరాకరించారు. కన్నాలక్ష్మీనారాయణ చాలా సీనియర్ అన్నారు. కన్నా వ్యాఖ్యలపై తాను స్పందించబోనన్నారు. పార్టీ అధిష్టానం దృష్టిలో అన్నీ అంశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
బీజేపీ ఏపీ కో కన్వీనర్ సునీల్ థియోధర్ విజయవాడకు వచ్చారు.కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై ఆయన స్పందించలేదు. సోము వీర్రాజు స్పందించారని చెప్పారు. సునీల్ థియోధర్ రాష్ట్ర పర్యటనలో ఉన్న సమయంలోనే కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ నాయకత్వం ఫోన్ చేసింది.
alsoread:టీడీపీతో పొత్తుండదు:బీజేపీ ఏపీ కో కన్వీనర్ సునీల్ థియోథర్
నిన్ననే కన్నా లక్ష్మీనారాయణ తన ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. లక్ష్మీనారాయణ పార్టీ మారుతారని ప్రచారం సాగుతుంది. ఈ విషయమై కన్నా లక్ష్మీనారాయణ స్పందించలేదు. గురువారంనాడు కూడ కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి ఆయన అనుచరులు చేరుకుంటున్నారు.సోము వీర్రాజు వ్యవహర శైలిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.