టీడీపీతో పొత్తుండదు:బీజేపీ ఏపీ కో కన్వీనర్ సునీల్ థియోథర్
భవిష్యత్తులో టీడీపీతో పొత్తు ఉండదని బీజేపీ ఏపీ కో కన్వీనర్ సునీల్ థియోథర్ తేల్చి చెప్పారు. జనసేనతో కలిసి పనిచేస్తామన్నారు. వైసీపీ,టీడీపీలు రెండూ ఒక్కటేనన్నారు.
అమరావతి: భవిష్యత్తులో టీడీపీతో తమకు పొత్తు ఉండదని బీజేపీ ఏపీ కో కన్వీనర్ సునీల్ థియోథర్ తేల్చి చెప్పారు. గురువారం నాడు బీజేపీ ఏపీ కో కన్వీనర్ మీడియా విజయవాడలో మీడియాతో మాట్లాడారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందన్నారు.కుటుంబ,అవినీతి పార్టీలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రోడ్ మ్యాప్ విషయంలో ఎలాంటి గందరగోళం లేదన్నారు.వైసీపీ, టీడీపీల్లో ఒకరు నాగరాజు,మరొకరు సర్పరాజు అని సెటైర్లు వేశారు.వైసీపీ, టీడీపీలు రెండు కూడా దొంగల పార్టీలేనని ఆయన విమర్శించారు. కన్నాలక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారని ఆయన గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం పార్టీ కార్యకర్తల సమావేశంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.మోడీ అంటే గౌరవం ఉందన్నారు. అయితే బీజేపీకి ఊడిగం చేయబోమని తేల్చి చెప్పారు. అదే సమయంలో తమ రాజకీయ వ్యూహం మార్చుకొంటామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన కొద్దిసేపటికే పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. విశాఖలో జరిగిన ఘటనలపై పవన్ కళ్యాణ్ కు సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్టుగా చంద్రబాబు చెప్పారు.. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి చేస్తామన్నారు .ఈ విషయమై ఇతర పార్టీలను కూడగడుతామన్నారు.
కొంతకాలంగా పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి గుడ్ బై చెప్పి టీడీపీతో జనసేనాని జత కడుతారా అనే చర్చ కూడా సాగుతుంది. రాష్ట్రంలో వైసీపీని గద్దె దించేందుకు ప్రభుత్వ వ్యతిరేక యఓటు చీలకుండా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ విషయమై మూడు ఆఫ్షన్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే.