టీడీపీ-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటిపోతోంది.  తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా శనివారం కౌంటర్‌ ఇచ్చారు. ఏపీకి కేంద్ర సాయంపై వీర్రాజు వ్యాఖ్యలు శుద్ధ అబద్ధమన్నారు.  ఏపీలో బీజేపీ ఒంటరిగా ఎప్పుడు ఎదగలేదని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్‌లో బీజేపీ ఎదుగుతుందని అనుకోవడం కూడా వాళ్ల అత్యాశేనని బోండా ఎద్దేవా చేశారు.  వీర్రాజు ఒంటరిగా రాజమండ్రిలో పోటీ చేస్తే కౌన్సిలర్‌గా కూడా గెలవలేరని మండిపడ్డారు.  

2009 ఎన్నికల్లో సోము ఎంపీగా పోటీ చేస్తే 15 లక్షల ఓట్లకు కేవలం 7వేల ఓట్లు మాత్రమే వచ్చాయని బోండా గుర్తు చేశారు. ఏపీకి అన్ని ఇచ్చాం, ఇన్ని ఇచ్చామని చెబుతున్నారని, 2016లో అరుణ్‌ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీలో ఒక్క రూపాయి అన్న రాష్ట్రానికి వచ్చిందా అని ప్రశ్నించారు.

వెనుకబడిన జిల్లాలకు బుదేల్ ఖండ్, కలహాండి ప్యాకేజీ తరహాలో ఇస్తామని చెప్పినా ఇప్పటికీ అమలు కాలేదన్నారు. రూ.24వేల కోట్లకుగానూ కేంద్రం కేవలం రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర రాజధానికి రైతులు రూ.50వేల కోట్లు విలువ చేసే భూమి ఇస్తే బీజేపీ రూ.1500కోట్లు ఇచ్చిందన్నారు.

దాంతో ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణం ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. వ్యక్తిగత ఎజెండాతోనే వీర్రాజు పని చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ-టీడీపీని మోసం చేసిందని అయిదు కోట్ల ప్రజలు అంటున్నారని, వారికి సోము వీర్రాజు సమాధానం చెప్పాలని బోండా డిమాండ్‌ చేశారు.