భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంపార్టీకి ఊహించనిరీతిలో షాక్ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డిపై టిడిపి చేస్తున్న ఆరోపణలకు మిత్రపక్షం భాజపా కౌంటర్ ఇవ్వటంతో టిడిపి నేతలు బిత్తరపోయారు. భాజపా ఇచ్చిన కౌంటర్ లో టిడిపి నేతల వైఖరిని తప్పుపడుతూనే వైసీపీని సమర్ధించేట్లుగా ఉంది. దాంతో భాజపా కౌంటర్ కు ఏమి సమాధానం చెప్పాలో టిడిపి నేతలకు దిక్కుతోచటం లేదు. భాజపాకు జగన్ దగ్గరవుతున్నారని జరుగుతున్న ప్రచారానికి సిద్దార్ధ్ మాటలు తోడవ్వటంతో టిడిపి నేతలు గింజుకుంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడిని జగన్ బుధవారం ఢిల్లీలో కలిసారు. దాదాపు 15 నిముషాల పాటు జరిగిన వీరి భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయి. సమావేశం అనంతరం మీడియాతో జగన్ మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అప్పటి నుండి తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో పాటు కేంద్రమంత్రులను ఎప్పటి నుండో  వివిధ సందర్భాల్లో జగన్ కలుస్తున్నారు.  

ఆ విషయాన్నే మంత్రులు, టిడిపి నేతలు జీర్ణించుకోలేకున్నారు. ఆర్ధిక నేరగాడు జగన్ ను రాష్ట్రపతి, ప్రధాని ఎలా కలుస్తున్నారంటూ మండిపడుతున్నారు. వారి లెక్క ప్రకారం జగన్ కు కేంద్రంలో ఎవరూ అపాయింట్మెంట్ ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. జగన్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత అన్న విషయాన్ని కూడా మరచిపోయి రెచ్చిపోతున్నారు.  సరే, దానికి వైసీపీ ఎలాగూ కౌంటర్ ఇస్తోందిలేండి అదివేరే సంగతి.

జగన్ తాజా ఢిల్లీ పర్యటనపై కూడా ఎప్పటిలాగే మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు రెచ్చిపోయారు. జగన్ మీదున్న కేసుల మాఫీ కోసమే ప్రధాని కాళ్ళపై జగన్ పడ్డారని ఆరోపణలు చేసారు. అసలు ప్రధానమంత్రి జగన్ ను ఎలా కలుస్తారన్నట్లుగా మాట్లాడారు.

అయితే, ఉమ ఆరోపణలకు ఒకవైపు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తుండగానే ఇంకోవైపు నుండి భాజపా జాతీయ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్  సిద్దార్ధనాద్ సింగ్ విజయవాడలోనే స్పందించారు. జగన్ ప్రదానిని కలవటంలో తప్పేమీలేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎవరినైనా కలవచ్చన్నారు. ప్రతిపక్ష నేత హోదాలోనే జగన్ ప్రధానమంత్రిని కలిసినట్లు చెప్పారు.

జగన్ పై కేసులకు ప్రధానిని కలవటానికి సంబంధమేమిటని ప్రశ్నించారు. కేసులున్నంత మాత్రాన జగన్ ప్రధానిని కలవకూడదా అంటూ టిడిపి నేతలనే ఎదురు ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతపై ఉన్న కేసులను న్యాయస్ధానాలు చూసుకుంటాయని, వాటితో తమకు సంబంధమే లేదని కూడా చెప్పారు. దాంతో భాజపా కు ఏమని సమాధానం చెప్పాలో టిడిపి నేతలకు అర్ధం కావటం లేదు.