టీడీపీ కార్యాలయంలో బీజేపీ పోస్టర్లు

bjp banners in tdp office at vijayanagarm district
Highlights

టీడీపీ కార్యాలయంలోనే బీజేపీ ప్రెస్ మీట్

‘‘టీడీపీ కార్యాలయంలో బీజేపీ పోస్టర్లు..’’ కొద్ది నెలల క్రితమైతే.. ఇలా జరగడాన్ని అందరూ కామన్ గా తీసుకునేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి అలా లేదు. టీడీపీ, బీజేపీ నేతలు ఉప్పు నిప్పులా ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఇలా జరగడం పార్టీ నేతల్లో కలవరాన్ని సృష్టిస్తోంది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే..

విజయనగరం జిల్లాలో టీడీపీలో పరిచయం అక్కరలేని వ్యక్తిగా చలామణి అవుతున్న ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ ఇలాకాలోనే వేరు కుంపటి రాజుకుంది. స్వయాన ఎమ్మెల్సీ జగదీష్‌ సోదరుడైన(అన్నయ్య) ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్‌ రామ్మోహనరావు ఈ నెల 22న బీజేపీలో చేరడం, వెనువెంటనే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అరకు ఇన్‌చార్జిగా డాక్టర్‌ రామ్మోహనరావును ప్రకటించారు. ప్రస్తుతం టీడీపీ  బీజేపీతో తెగతెంపులు చేసుకొని కేంద్రంపై నిందారోపణలు చేస్తున్న తరుణంలో టీడీపీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ సోదరుడు రామ్మోహనరావు బీజేపీలో చేరడం జిల్లా వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.

ద్వారపురెడ్డి జగదీష్‌కి ఇంటిపోరు ప్రారంభమయ్యిందని, ప్రజలు గుసగుసలాడుతున్నారు. స్వయాన తమ్ముడు తెలుగుదేశం పార్టీలో ఉన్నత స్థాయిలో ఉండడంతోపాటు ఎమ్మెల్సీ పదవితో జిల్లాలో చక్రం తిప్పుతున్న తరుణంలో అన్న రామ్మోహనరావు బీజేపీలో చేరడమే ఓ పెద్ద సంచలనంగా చెప్పుకుంటున్న తరుణంలో ఆదివారం ఏకంగా తెలుగుదేశం కార్యాలయంలోనే బీజేపీ ప్రెస్‌మీట్‌ పెట్టడాన్ని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ బ్యానర్‌పై బీజేపీ జెండాలను, మోదీ ఫొటోను ఏర్పాటు చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సంఘటనతో డాక్టర్‌ రామ్మోహనరావును అడగలేక, ఎమ్మెల్సీ జగదీష్‌ను ప్రశ్నించలేక కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు చాలామంది వారిలో వారే నలిగిపోతున్నారు. 

loader