జనసేన, బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుంది: పురంధేశ్వరి
బీజేపీ, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్ధిని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు.
రాజమండ్రి: జనసేనతో పొత్తు కొనసాగుతుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు.బుధవారంనాడు రాజమండ్రిలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. బీజేపీ, జనసేన పార్టీల సీఎం అభ్యర్థిని పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీలతో పొత్తుల విషయమై అధిష్టానానిదే తుది నిర్ణయమని పురంధేశ్వరి ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి సహకారం అందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మళ్ళిస్తుందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు రాష్ట్రాలకు 4 కోట్ల ఇళ్లను కేటాయించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి 22 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఎందుకు ఇళ్లను ఇవ్వడం లేదో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల విషయమై కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ను కలుస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల విషయమై రాష్ట్ర ప్రభుత్వం సరైన సమాచారం ఇవ్వడం లేదని పురంధేశ్వరి ఆరోపించారు.
2019 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తు కుదుర్చుకుంది. 2024 ఎన్నికల వరకు పొత్తు కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సోము వీర్రాజు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కొనసాగిన సమయంలో ఈ రెండు పార్టీల మధ్య గ్యాప్ కొనసాగింది. అయితే బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని ఈ నెల మొదటి వారంలో ఆ పార్టీ నాయకత్వం నియమించింది.
జనసేనతో మైత్రిని మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తో తాను త్వరలోనే భేటీ కానున్నట్టుగా పురంధేశ్వరి ఇటీవల ప్రకటించారు. ఈ నెల 18న న్యూఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి జనసేనకు కూడ ఆహ్వానం అందింది.ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పొత్తులపై కూడ చర్చించారు.రానున్న ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకోవాలని బీజేపీ నాయకత్వం వ్యూహరచన చేసింది. ఈ నెల మొదటి వారంలో హైద్రాబాద్ లో జరిగిన సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దక్షిణాది రాష్ట్రాల నేతలకు దిశానిర్ధేశం చేశారు.