వర్క్ షాపులతో భాజపా బలపడుతుందా? రెండున్నరేళ్ళుగా కొత్త అధ్యక్షుడినే నియమించుకోలేని వైనం మిత్రపక్షంగా భాజపా ఎదుగుదల సాధ్యమేనా

భారతీయ జనతా పార్టీ పెద్ద జోక్ వేసింది. ఏపిలో పార్టీ బలోపేతానికి రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు పార్టీ నేత పురంధేశ్వరి ప్రకటించారు. వర్క్ షాపులు నిర్వహిస్తే పార్టీ బలపుడుతుందా? ఏదో కాలం కలిసి వచ్చి పోయిన ఎన్నికల్లో కాసిని శాసనసభా స్ధానాలు, ఎంపి సీట్లు వచ్చాయి. అంతే కానీ భాజపాకు ఎప్పుడూ ఇన్ని సీట్లు గెలుచుకునేంత సీన్ లేదన్న సంగతి కాషాయదళానికి బాగా తెలుసు.

పోయిన ఎన్నికల్లో రాష్ట్ర విభజన వంటి ప్రత్యేక పరిస్ధితులు, కేంద్రంలో యూపిఏపై దేశవ్యాప్తంగా పెల్లుబిక్కిన వ్యతిరేకత, మోడీ ఇమేజి, తెలుగుదేశంతో పొత్తు, సినీనటుడు పవన్ కల్యాణ్ కలవటం తదితర సమీకరణలు కలిసి రావటంతో కొన్ని సీట్లు వచ్చాయి. దాన్నే పురంధేశ్వరి తమ నిజమైన బలమన్న భ్రమల్లో ఉన్నట్లున్నారు.

రెండున్నరేళ్లుగా అటు జాతీయ స్ధాయిలోను ఇటు రాష్ట్రంలో మిత్రపక్షంగా టిడిపితో అధికారాన్ని పంచుకుంటున్న పార్టీగా భాజపాలో ఏమాత్రం సంతోషం కనిపించటం లేదు. నేతల్లోనే కాదు ఉన్న కొద్దిపాటి క్యాడర్ లో కూడా పూర్తి నైరాస్యం కమ్ముకున్నది. దానికి కారణం భాజపాకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న నేతలే. టిడిపి వ్యవహారం నచ్చకపోయినా చేసేదేమీ లేక కేవలం పార్టీ సమావేశాల్లో మాత్రమే మాట్లాడుకుంటున్నారు. పోనీ ప్రభుత్వంలో పదవులేమన్నా దక్కుతున్నాయా అంటే అవీ లేవు.

గడచిన రెండున్నరేళ్ళలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు తీసుకున్న నిర్ణయాల్లో ప్రజావ్యతిరేకమైనవి చాలానే ఉన్నాయని సోము వీర్రాజు వంటి భాజపా నేతలే ఎన్నోమార్లు బహిరంగంగానే ప్రకటించారు. అంతేకాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సక్షేమ కార్యక్రమాల్లో అవినీతి జరుగుతోందని కూడా ఇప్పటికే ఎన్నో ఆరోపణలు చేసారు. అయితే, టిడిపి మిత్రపక్షం అవటంతో ప్రత్యక్ష చర్యలకు దిగలేకున్నారు.

 టిడిపి పాలనపై వ్యతిరేకంగా ఇప్పటికే సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, కావూరి సాంబశివరావు, పురంధేశ్వరి లాంటి వారే ఎన్నోమార్లు వ్యాఖ్యలు చేసారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగాను, రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్ధితులకు వ్యతిరేకంగా నేతలు కేంద్రప్రభుత్వానికి ఎన్నో నివేదికలు సమర్పించిన సంగతి అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని కాషాయదళాలు చెబుతూ టిడిపికి మిత్రపక్షంగా ఉన్నంత కాలం తమ పార్టీకి రాష్ట్రంలో ఎదుగుదల సాధ్యం కాదని ఆఫ్ ది రికార్డుగా అంగీకరిస్తూనే ఉన్నారు.

 అంతెందుకు, రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగేందుకు తనకు ఏమాత్రం ఆశక్తి లేదని హరిబాబు జాతీయ నాయకత్వానికి చెప్పినా రెండున్నరేళ్ళుగా కొత్త అధ్యక్షుడిని నియమించలేని దుస్ధితిలో ఉన్న భాజపా ఇక ఏ విధంగా బలపడుతుందో పురంధేశ్వరే చెప్పాలి.