అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి బీహార్ ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. జేడీయు అధినేత నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరిస్తూ బిజెపి ఆయనతో పొత్తు పెట్టుకుంది. అదే రకంగా ఏపీలో పవన్ కల్యాణ్ ను బిజెపి, జనసేన కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తెచ్చే అవకాశాలున్నాయి. 

ఏపిలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడంతో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందని బిజెపి భావించినట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలో ఏపీలో బలంగా ఉన్నాయి. అవి రెండు మాత్రమే ఒకదానికి ఒకటి ప్రత్యామ్నాయంగా ముందుకు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ తన జనసేనను మూడో ప్రత్యామ్నాయంగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. 

Also Read: జగన్ కు గుబులు, చంద్రబాబుకు షాక్: బిజెపితో పవన్ కల్యాణ్ పొత్తు

ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేయడం బిజెపికి అంత సులభంగా కనిపించలేదు. దాంతో ప్రాంతీయ పార్టీ అయిన జనసేనతో పొత్తుకు సిద్ధపడినట్లు అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ కు ఉన్న అభిమానుల సంపదను, సామాజిక వర్గాన్ని దృష్టిలో ఉంచుకుని బిజెపి పెద్దలు జనసేనతో పొత్తుకు సిద్ధపడినట్లు భావించవచ్చు. 

పవన్ కల్యాణ్ కు విశేషమైన అభిమానులు ఉన్నప్పటికీ పార్టీపరంగా సరైన నిర్మాణం, నిర్వహణ కొరవడింది. పవన్ కల్యాణ్ కు జతగా సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఉన్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. జగన్, చంద్రబాబులను ఎదుర్కుని ముందుకు నడవాలంటే తనకు సరైన అండదండలు అవసరమని కూడా పవన్ కల్యాణ్ భావించి ఉంటారు. 

తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా కూడా తాను ద్వితీయ స్థానంలోనే ఉండాల్సి వస్తుందనే విషయం పవన్ కల్యాణ్ కు తెలుసు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తాను పక్కకు జరిగి ముఖ్యమంత్రి పదవి తనకు ఇస్తారనే నమ్మకం పవన్ కల్యాణ్ కు లేదు. అది అసాధ్యం కూడా. గత ఎన్నికల ఫలితాలను చూపి సీట్ల సర్దుబాటులో కూడా చంద్రబాబు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు. దాంతో ఆయన బిజెపి వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

Also Read: ఏపీలో బీజేపీ, జనసేన పొత్తు: సీఏఏకు జై కొట్టిన పవన్

బిజెపి నిర్మాణనిర్వహణలో సామర్థ్యం పవన్ కల్యాణ్ కు ఉపయోగపడుతాయని, పవన్ కల్యాణ్ కు ఉన్న ప్రజాదరణ బిజెపికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జనసేన, బిజెపి కలిస్తే వచ్చే ఎన్నికల నాటికి బలమైన కూటమిగా రూపొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీని వెనక్కి నెట్టి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రత్యామ్నాయంగా మారడానికి అవకాశాలుంటాయని అంటున్నారు. 

బిజెపికి రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు. తమకు అనుకూలమైన ప్రభుత్వం ఉంటే చాలు. అందుకే జనసేనతో అధికారాన్ని పంచుకోవడానికి బిజెపి ముందుకు వచ్చినట్లు చెప్పవచ్చు. పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెట్టడంలో ఇబ్బందులు కూడా ఉండకపోవచ్చు. అదే హామీని బిజెపి, ఆర్ఎస్ఎస్ పెద్దలు బహుశా పవన్ కల్యాణ్ కు ఇచ్చి ఉంటారని అంటున్నారు. అందుకే పవన్ కల్యాణ్ పొత్తుకు సిద్ధపడ్డారనే ప్రచారం సాగుతోంది.

సమీపంలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నందున బిజెపి, జనసేన కూటమి ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందనే అంచనాకు కూడా రావడానికి వీలుంటుంది, పైగా సార్వత్రిక ఎన్నికలకు నాలుగేళ్లకు పైగా సమయం ఉంది. ఈ నాలుగేళ్లలో ఇరు పార్టీల కూటమిని మరింతగా బలోపేతం చేసి, ముందుకు సాగడానికి తగిన కార్యాచరణను చేపట్టి అమలు చేయడానికి వీలుంటుంది.