Asianet News Telugu

ఏపీలో ఇంట్రెస్టింగ్ డిబేట్: టీడీపీలో మిగిలేది ఆ ఇద్దరా లేక ముగ్గురా...?

టీడీపీలో ఉండేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మినహా మిగిలిన వారంతా సుజనాతో టచ్ లో ఉన్నారేమోనంటూ ఒక బాంబు పేల్చారు.
 

Big debate in ap politics:Telugu Desam Party had three MLAs or two
Author
Amaravathi, First Published Nov 22, 2019, 10:12 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రాజకీయాల్లో నిత్యం ఏదో ఒక హాట్ టాపిక్ పై జోరుగా చర్చ జరుగుతూనే ఉంది. మెన్నటి వరకు ఇసుక కొరత, నిన్నటికి నిన్న ఇంగ్లీషు మీడియం వీటన్నింటికి జగన్ ప్రభుత్వం ఫుల్ స్టాప్ లు పెడుతూ వస్తుంటే తాజాగా మరో బాంబు పేల్చారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైసీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. అంతేకాదు టీడీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యే బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ టీడీపీని కూడా కెలికి వదిలేశారు. 

సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. తమ ఎంపీలు గానీ, ఎమ్మెల్యేలు గానీ బీజేపీలో చేరాల్సినంత అవసరం లేదంటూ వైసీపీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అంతేకాదు తమతో టచ్ లో ఉన్నారన్నందుకు ఎంపీ సుజనా చౌదరిని పార్టీపరంగానూ వ్యక్తిగతంగానూ తిట్టి పోసింది. 

అటు టీడీపీ సైతం సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండించింది. కన్నతల్లిలాంటి టీడీపీని వదిలి సవతి తల్లిలాంటి బీజేపీలో చేరేందుకు ఏ ఎమ్మెల్యే సిద్ధంగా లేరంటూ టీడీపీ చెప్పుకొచ్చింది. ఎండమావులను చూసి నీరనుకునేటంత అమాయకులు తమ పార్టీలో లేరని చెప్పుకుంటోంది. 

అయితే బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను వ్యూహాత్మకంగా టీడీపీకి అప్లై చేస్తోంది వైసీపీ. టీడీపీ నుంచే సుజనా చౌదరి బీజేపీలో చేరారు కాబట్టి ఆయనకు తెలిసిందల్లా టీడీపీ ఎమ్మెల్యేలేనని వారినే తీసుకెళ్తారంటూ టీడీపీలో గుబులు పుట్టిస్తోంది. 

బీజేపీ చేసిన విమర్శలను వైసీపీ తమవైపు నెట్టేయడంతో టీడీపీ గందరగోళంలో పడింది. వైసీపీకి చెందిన నేతలు బీజేపీకి టచ్ లో ఉన్నారనడంతో టీడీపీ శిబిరంలో కాస్త ఉత్సాహం నెలకొన్నప్పటికీ 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని సుజనా వ్యాఖ్యలు చేయడం అది నిజమేనంటూ వైసీపీ చెప్పడంతో టీడీపీ శిబిరంలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. 

20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం

20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉంటే ఇక టీడీపీలో ఉండేది ఎవరని గుసగుసలాడుకుంటున్నారట. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంది. అయితే వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నట్లు కూడా ప్రకటించేశారు.

వంశీ వైసీపీ గూటికి చేరిపోతే ఇక మిగిలింది టీడీపీలో 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. వారిలో 20 మంది వెళ్లిపోతే ఇక మిగిలేది ఇద్దరే. ఆ ఇద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. 

అంటే టీడీపీకి వీరవిధేయులుగా ఉన్న కింజరపు అచ్చెన్నాయుడు, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పలు సైతం బీజేపీలో చేరిపోతారా అంటూ ప్రచారం జరుగుతుంది.

సుజనా చౌదరి చెప్పిన విషయాలను గుర్తు చేస్తూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో ఉండేది ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయన వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మినహా మిగిలిన వారంతా సుజనాతో టచ్ లో ఉన్నారేమోనంటూ ఒక బాంబు పేల్చారు.

మోదీని కలిస్తే తప్పా, అడక్కుండానే వివరణ ఇచ్చా: జగన్ తో భేటీపై ఎంపీ రఘురామకృష్ణంరాజు

నిజంగా 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్ లో ఉంటే చంద్రబాబుకు గడ్డు పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ అని చెప్పాలి. ఇప్పటికే గత ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చంద్రబాబుకు ఈ పరిణామం ఘోరమనే చెప్పాలి.  

రాష్ట్ర రాజకీయాల్లో అపర చాణుక్యుడు అంటూ చంద్రబాబును చెప్తూ ఉండేవారు. అలాంటి చంద్రబాబు మాస్టర్ మైండ్ వ్యూహాలు ఇప్పుడు పని చేయకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎగిరిపోయేందుకు క్యూ కడుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది.  
 
ఇప్పటి వరకు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితోపాటు వైసీపీ నేతలు సైతం టీడీపీ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ గేట్లు ఎత్తితే టీడీపీ పార్టీ జగన్ స్టోర్ రూమ్ లో ఉంటుందంటూ హెచ్చరించారు. అంతేకాదు సుజనా చౌదరి వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ చిటికె వేస్తే టీడీపీ ఖాళీ అంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ఒకవైపు జాతీయ పార్టీ బీజేపీ మరోవైపు అధికారంలో ఉన్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారు తమతో టచ్ లో ఉన్నారంటూ ప్రచారం చేస్తుండటంతో టీడీపీలో గందరగోళం నెలకొంది. అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మౌనం దాల్చడం కూడా చర్చనీయాంశంగా మారింది. 
 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios