కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన భూమా కుటుంబం అయితే బయటకు రాని పరిస్థితి నెలకొందట. 

కర్నూలు జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంతో ఏం చేయాలో తోచడం లేదట. మంత్రిగా పనిచేసినా ప్రజలు తిరస్కరించడంతో మదనపడుతున్నారట భూమా అఖిలప్రియ. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఉంటే గెలిచేవాళ్లమని ఆమె తన సహచరులు వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. 

ఆళ్లగడ్డలో తాము ఓడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని భూమా అఖిల ప్రియ చెప్తున్నారట. తాము వైసీపీలో ఉండి ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్లమని చెప్తున్నారట. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిందని ఆమె అభిప్రాయపడ్డారట.  

ఈసారి ఎన్నికల్లో భూమా అఖిలప్రియ తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అలాగే అఖిలప్రియ సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి సైతం నంద్యాలలో శిల్పారవిచంద్ర కిశోర్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

భూమా అఖిలప్రియ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి, మావయ్య ఎస్వీ మోహన్ రెడ్డిలతో కలిసి ఆమె సైకిలెక్కేశారు. 

భూమా నాగిరెడ్డి అకాల మరణం అనంతరం భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు చంద్రబాబు నాయుడు. అనంతరం జరిగిన ఉపఎన్నికల్లో సోదరుడు భూమా బ్రహానందరెడ్డికి టికెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు భూమా అఖిలప్రియ. 

అదే వేవ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొనసాగుతుందని భావించారు. అయితే ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో భూమా కుటుంబం ఒక్కసీటు కూడా గెలుచుకోలేకపోయింది. భూమా కుటుంబంతోపాటు కేఈ కుటుంబం, కోట్ల కుటుంబం, టీజీ వెంకటేశ్ కుటుంబాలు సైతం ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూశాయి.