హైదరాబాద్‌: తన చార్జిషీటులో వైఎస్ భారతి పేరు చేర్చిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందుకు సంబంధించిన వివరణ కూడా ఇచ్చింది. క్విడ్‌ ప్రో కో పద్ధతిలో నిధుల ప్రవాహం జరిగిన భారతి సిమెంట్‌తోపాటు జగన్‌ కంపెనీల్లో డైరెక్టర్‌గా, ప్రధాన వాటాదారుగా ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పింది. ఈ మేరకు ఆదివారం మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. 

భారతి సిమెంట్‌పై దాఖలు చేసిన అభియోగపత్రంలో 19 మంది పేర్లను ఈడీ చేర్చింది. వారిలో భారతి ఒకరు. నేరపూరిత చర్యల ద్వారా వస్తున్న ఆర్థిక ఫలాలను ఆమె అనుభవిస్తున్నారని ఈడీ స్పష్టం చేసింది. విచారణలో నిమిత్తం తమ ముందు హాజరు కావాలని భారతికి మూడుసార్లు సమన్లు పంపినా పట్టించుకోలేదని వెల్లడించింది. 

ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్లు, వాటాలు, స్థిర చరాస్తుల్లో పెట్టుబడులకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని జగన్‌ కంపెనీలకు పలుమార్లు సమన్లు జారీచేసినా కూడా స్పందించలేదని చెప్పింది. జగన్‌ తన గ్రూప్‌ కంపెనీల నుంచి డైరెక్టర్‌గా వైదొలగిన తర్వాత భారతి క్రియాశీల పాత్ర పోషిస్తున్నారని, విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారని, నిధుల బదిలీకి సంబంధించిన చెక్కులపై, ఆడిట్‌ బ్యాలెన్స్‌ షీట్లపైనా, ఇతర అన్ని పత్రాలపైనా ఆమే సంతకం చేస్తున్నారని ఈడీ తెలిపింది. 

మీడియా కథనాల ప్రకారం ... పర్‌ఫిసిమ్‌కు జగన్‌ తన వాటాలు విక్రయించగా వచ్చిన భారీ నిధులు భారతికి లభించాయని, అవే సొమ్ములను జగన్‌కు చెందిన వివిధ కంపెనీల్లోకి పెట్టుబడులుగా ఉపయోగించారని వివరించింది. 

జగన్‌కు చెందిన సండూర్‌ పవర్‌ను కీల్వాన్‌ టెక్నాలజీ కంపెనీ ద్వారా స్వాధీనం చేసుకుని ప్రధాన లబ్ధిదారుగా మారారని ఈడీ తెలిపింది. భారతి సిమెంట్స్‌, సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగవత్‌ సన్నిధి ఎస్టేట్స్‌లు మనీ లాండరింగ్‌కు పాల్పడ్డాయని అంటూ ఇందులో జగన్, భారతి పాత్ర ఉందని చెప్పింది.