Elections 2024: కాయ్ రాజా కాయ్... ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్ |
Elections 2024: ఎన్నికల వేళ బెట్టింగ్ రాయులు సందడి చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనీ, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటూ జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నాయి.
Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నాయకుల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తమైంది. ఓటర్లు ఏం తీర్పు చెప్పారనే విషయం మరో 2 రెండు వారాల్లో తేలిపోనుంది. జూన్ 4వ తేదీన విజయం ఎవరిని వరిస్తుందో.. ఎవరిని దూరం పెడుతుందో తెలుస్తుంది. అప్పటి వరకు అంతా ఎదురుచూడాల్సిందే. కానీ కొంతమంది ఔత్సాహికులు అప్పటి దాకా ఎదురుచూడలేక పోతున్నారు. ఫలితాలకు ముందే ఫలానా చోట ఫలానా వ్యక్తి గెలుస్తారని జోస్యం చెబుతున్నారు.
ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఐపీఎల్ లో బెట్టింగ్ లు పెడుతున్న తీరులో ఇప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ పై కూడా బెట్టింగ్ ల దందా జోరుగా కొనసాగుతోంది. ఈ తంతు పట్నం పల్లెల్లోకీ విస్తరించింది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ? పార్లమెంట్ సీట్ల వారీగా ఎవరు గెలవబోతున్నారు ? ఏ స్థానంలో ఏ అభ్యర్థికి ఎంత మెజారిటీ రాబోతోంది ? ఏ పార్టీ ఏ స్థానంలో ఓడిపోబోతోంది ? అనే అంశాలపై జోరుగా బెట్టింగ్ లు సాగుతున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, పెద్దపల్లి, నాగర్ కర్నూల్, భువనగిరి, మహబూబాబాద్, చేవెళ్ల స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ లు పెడుతున్నారు. అలాగే మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, జహీరాబాద్, మెదక్, భువనగిరి, చేవెళ్ల వంటి ప్రాంతాల్లో బీజేపీ గెలుస్తుందని బెట్టింగ్ లు సాగుతున్నాయి. సికింద్రాబాద్, చేవెళ్ల, మెదక్, పెద్దపల్లి, నాగర్ కర్నూల్ వంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని బెట్టింగ్ లు పెడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ బెట్టింగ్ లపై వచ్చే రిటర్న్స్ అన్ని పార్టీలకు ఒకేలా లేవు. ఒక్కో పార్టీకి ఒక్కో విధంగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పై బెట్టింగ్ కాస్తే.. లక్ష రూపాయిలకు లక్ష, అయితే బీఆర్ఎస్ పై పెడితే మాత్రం రెండింతలు, మూడింతలు కూడా ఇస్తామని బెట్టింగ్ లు నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితి చూస్తుంటే బీఆర్ఎస్ గడ్డుకాలం వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ నేతలే విజయంపై సంగ్దితత వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ నియోజకవర్గంలో ఎంత మెజారిటీతో గెలుస్తున్నామో కూడా ఆ పార్టీ నాయకులు ధీమాగా చెప్పేవారు.
ఇదిలా ఉండగా.. ఏపీ ఎన్నికలపై కూడా జోరుగా బెట్టింగ్ సాగుతోంది. ఈ సారి పోలింగ్ రోజు హైదరాబాద్ ఖాళీగా కనిపించింది. సిటీలో ఏపీ ప్రజలే ఎక్కువగా నివసిస్తుండటం, వారంతా ప్రత్యేక వాహనాలు అద్దెకు తీసుకొని మరీ ఓటేసేందుకు వెళ్లడంతో పట్నం బోసిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి కనిపించలేదు. దీంతో హైదరాబాద్ లో సెటిలైన ఏపీ ఓటర్లు వేసిన ఓట్లు పార్టీల గెలుపు ఓటముల్లో కీలకంగా మారనున్నాయి. దీనిని అంచనా వేసుకొని కూడా బెట్టింగ్ లు నడుస్తున్నాయి.
ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేయగా.. కాంగ్రెస్ వామపక్షాల మద్దతుతో పోటీలో నిలిచింది. దీంతో కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని, వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయని బెట్టింగ్ లు వేస్తున్నారు. ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే ఏర్పాటు కాబోతోందని ఇటీవల కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది వైసీపీపైనే బెట్టింగ్ లు కాస్తున్నారని తెలుస్తోంది.