Asianet News TeluguAsianet News Telugu

నూతన విద్యావిధానం అమలుకు సిద్దం కండి: విద్యాశాఖ అధికారులకు సీఎం జగన్ ఆదేశం (వీడియో)

ఆంధ్ర ప్రదేశ్ లో నూతన విద్యా విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయడానికి సిద్దంగా వుండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

Be Ready to Implement New Education Policy in AP... CM YS Jagan Orders Education Department
Author
Amaravati, First Published Sep 7, 2021, 4:11 PM IST

అమరావతి: నూతన విద్యావిధానం అమలుపై అన్నిరకాలుగా సిద్ధంకావాలని... ఆ దిశగా అడుగులు ముందుకేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో నాడు–నేడుతో పాటు పౌండేషన్‌ స్కూళ్లపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలిచ్చారు. 

విద్యార్థులకు మరింత మెరుగైన విద్య అందేలా పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం పాఠశాలల్లో కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. 

సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పై సీఎంకు వివరాలు అందించారు విద్యాశాఖ అధికారులు. ముందుగా వెయ్యి స్కూళ్లను అఫిలియేషన్‌ చేస్తున్నామని సీఎంకు తెలిపారు. అన్నిరకాల స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఐసీఎస్‌ఈ అఫిలియేషన్‌ మీద కూడా దృష్టిపెట్టాలన్నారు.

వీడియో

నాడు–నేడు కింద రెండో విడతలో 12,663 స్కూళ్లను తీసుకున్నట్లు... రూ. 4535.74 కోట్ల ఖర్చుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఇందులోభాగంగా 18,498 అదనపు తరగతి గదులు నిర్మించనున్నట్లు తెలిపారు. ఇక మూడో విడతలో నాడు–నేడు కింద 24,900 స్కూళ్లను తీసుకుని రూ.7821 కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. రెండో దఫా నాడు–నేడుకు సంబంధించి టెండర్ల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. 

read more  వినాయకచవితి వివాదం... ఇలాగయితే మీ మీదా కేసులు తప్పవు: బిజెపి శ్రేణులకు మంత్రి వెల్లంపల్లి వార్నింగ్

నాడు–నేడు పనులకు సంబంధించి సచివాలయంలో ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. సుమారు 12వేల మందికి శిక్షణ అందించినున్నట్లు... అనంతరం పేరెంట్స్‌ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు సీఎం జగన్ కు తెలిపారు అధికారులు. 

స్కూళ్ల నిర్వహణ మరీముఖ్యంగా టాయిలెట్ల నిర్వహణలపై ప్రత్యేక శ్రద్ద చూపించాలని సీఎం సూచించారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా ఇంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత ఖచ్చితంగా స్కూళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.లేకపోతే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లిపోతాయన్నారు. స్కూళ్లలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే చేయించడానికి కంటిజెన్సీ ఫండ్‌ ఒకటి ప్రతి స్కూల్లో ఉంచాలన్నారు.దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలన్నారు. అప్పుడే స్కూళ్లు నిత్యనూతనంగా ఉంటాయిన్నారు సీఎం జగన్.

జగనన్న విద్యాకానుకపై కూడా సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ ఏడాది విద్యాకానుక కింద నూటికి నూరుశాతం పంపిణీ పూర్తయిందని అధికారులు తెలిపారు. కోవిడ్‌ పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నందున వచ్చే ఏడాది పిల్లలు స్కూల్‌కు వెళ్లేనాటికే విద్యాకానుక అందించాలని సీఎం ఆదేశించారు. వచ్చే ఏడాది విద్యా కానుక కింద ఇవ్వనున్న వస్తువులపై సీఎంకు వివరాలు అందించిన అధికారులు. విద్యాకానుక కింద ఇచ్చే వస్తువులు నాణ్యతగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు. వచ్చే ఏడాది నుంచి విద్యాకానుకలో భాగంగా స్పోర్ట్స్‌ షూ, స్పోర్ట్స్‌ డ్రస్సులు మంచి డిజైన్, నాణ్యత ఉండేలా చూడాలన్నారు. 

ఈ సమీక్షా సమావేశానికి పాఠశాల విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్,  పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వ శిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రోజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి ప్రతాప్‌ రెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios