Asianet News TeluguAsianet News Telugu

వినాయకచవితి వివాదం... ఇలాగయితే మీ మీదా కేసులు తప్పవు: బిజెపి శ్రేణులకు మంత్రి వెల్లంపల్లి వార్నింగ్

వినాయకచవితి వేడుకలపై ఇప్పటికే ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉళ్లంఘిస్తే ఊరుకునేది లేదని... బిజెపి నాయకులు ఈ పని చేసి కేసులు పెడతామని దేవాదాయ శాఖ మంత్రి హెచ్చరించారు. 

restrictions on vinayaka chavithi celebrations... minister vellampally warning to ap bjp leaders
Author
Amaravati, First Published Sep 6, 2021, 4:24 PM IST

తాడేపల్లి: వినాయక చవితి పండగను చేసుకోకుండా వైసిపి ప్రభుత్వం ఆంక్షలు విధించిందంటూ రాష్ట్ర బీజేపీ నేతలు నిన్న కర్నూలులో, ఈరోజు పలు జిల్లాల్లో ఆందోళనలు పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కుల, మత రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వినాయక చవితి చేసుకోకూడదని ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా..? ప్రభుత్వం తరఫున ఎవరైనా చెప్పారా..? అని మంత్రి నిలదీశారు. 

''పెద్దఎత్తున వేడుకలు జరగకుండా, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ... కేంద్ర హోం శాఖ ఆగస్టు 28, 2021న ఇచ్చిన గైడ్ లైన్సును అనుసరించి పండుగ జరుపుకోవాలనే చెప్పాం. వినాయక చవితి అందరి పండుగ,  అందరూ చేసుకోవచ్చు.  ఇళ్ళల్లో చేసుకోవచ్చు, దేవాలయాల్లోనూ చేసుకోవచ్చు. పెద్ద పెద్ద విగ్రహాలు వీధుల్లో పెట్టి, భారీ ఎత్తున వేలు, లక్షల మందితో ఊరేగింపులు, హంగామాలు, ఆర్భాటాలు చేయడం వద్దని మాత్రమే చెప్పాం.  పక్కనున్న బీజేపీ పాలిత కర్ణాటక ప్రభుత్వం కూడా 20 మందితో పండుగ చేసుకోండి, ఊరేగింపులు చేసుకోవద్దు.. అని నిబంధలు విధించింది. 20 మందితో ఉత్సవం జరపడం వీలవుతుందా..?'' అని బిజెపి నాయకులను మంత్రి ప్రశ్నించారు. 

''ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ మీద ఉంటుంది. బీజేపీకి ఈ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ లేరు. ఎంతసేపటికీ మతం ముసుగులో రాజకీయం చేస్తున్నారు తప్పితే మరొకటి కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఓట్లు వేయలేదు కాబట్టి ఇక్కడి ప్రజలు మరణించినా, ఏమైపోయినా పర్వాలేదన్నది బీజేపీ విధానమా.. ? ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభించాలని మీరు కోరుకుంటున్నారా సోము వీర్రాజు?'' అని మంత్రి అడిగారు.

''కోవిడ్ వల్ల ఇప్పటికీ ఎంతో మంది తమ కుటుంబాలను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి పండుగ పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఏమిటి..? కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పండుగలు జరుపుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. పండుగలకు సంబంధించి కేంద్రం ఏవైతే మార్గదర్శకాలు ఇచ్చిందో.. ఆ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా, ఆఖరికి బీజేపీ నేతలు వ్యవహరించినా మీ మీద కూడా కేసులు పెడతాం. అందులో ఎటువంటి సందేహం లేదు'' అని హెచ్చరించారు. 

read more  వినాయకచవితి వేడుకలపై ఆంక్షలు... విశాఖలో బిజెపి ధర్నా, జివిఎంసి వద్ద ఉద్రిక్తత (వీడియో)

''కోవిడ్ నేపథ్యంలోనే కుంభ మేళాకు అనుమతిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత వచ్చిందో చూశాం. అలాంటి తప్పులే చేయాలంటారా..? హిందూ మతం మీద ప్రేమ, గౌరవం బీజేపీకి ఉంటే చంద్రబాబు హయాంలో విజయవాడలో 50 పురాతన దేవాలయాలు కూల్చివేసినప్పుడు... గోదావరి పుష్కరాల్లో  30 మంది అమాయక భక్తుల్ని పొట్టనపెట్టుకున్నప్పుడు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడలేదు..? చంద్రబాబు చేసింది తప్పు అని ఏనాడూ బీజేపీ ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు. 

''ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తుంటే ఆయనపై మత ముద్ర వేసే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల్లోనే కులం, మతం, పార్టీ చూడం అని జగన్ ప్రకటించారు. ఆఖరికి బీజేపీ లో పనిచేసే వారికి కూడా పక్కా ఇళ్ళు కట్టిస్తున్నాం... సంక్షేమ పథకాలను ఇంటింటికీ అందిస్తున్నాం'' అన్నారు. 

''బీజేపీ ధర్నాలు చేయాల్సింది రాష్ట్రంలోని కలెక్టరేట్ల ముందు కాదు.. ఆగస్టు 28న కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ సీఎస్ కి రాసిన లేఖ ప్రకారం కరోనా నిబంధనలు తప్పు అయితే కేంద్రంలోని మీ హోం శాఖ మంత్రి కార్యాలయం ముందో లేక కేంద్ర ప్రభుత్వం ముందో ధర్నాలు చేయండి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను మార్చే ధైర్యం సోము వీర్రాజుకి గానీ మరొకరికి గానీ ఉందా..? ఆ లేఖలోనే కోవిడ్  నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాసి  ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రిత్వ శాఖను అడిగి ఆ గైడ్ లెన్స్ ను మార్పించండి'' అని సూచించారు.

''రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాట్లాడే మాటలు ప్రకారం... ఇటువంటి నిబంధనలు విధించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకమా..? చెప్పండి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి, ప్రజల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదు'' అన్నారు. 

''ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం అన్ని కులాలు, మతాలు బాగుండాలన్నదే.  తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికల సమయంలోనూ బీజేపీ నేతలు మతాన్ని, కులాన్ని రెచ్చగొట్టి, హిందూ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేయాలని కుట్రలు పన్నితే.. మీకు డిపాజిట్లు రాకుండా ప్రజలు ఓడించింది అప్పుడే మరచిపోయారా? ఇటువంటి మత రాజకీయాలు చేయవద్దని బీజేపీ ముసుగులో ఉన్న టీడీపీ నేతలను కూడా హెచ్చరిస్తున్నాం'' అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios