ఏలూరు:  మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ‍్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య అన్నారు. వైఎస్ఆర్, వైఎస్ జగన్‌పై కృష్ణయ్య ప్రశంసలు కురిపించారు.

ఆదివారం నాడు ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడారు.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉన్న నాయకుడన్నారు.  బీసీల కోసం తాను చేసిన పోరాటాలకు వైఎస్ స్పందించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.  బీసీల కోసం కమిటీ కూడా వేశారు. బీసీలకు ఏదైనా చేసిన నాయకుడు ఉన్నారంటే వైఎస్సార్ అనే చెప్పాలన్నారు.

 తండ్రి అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారని కృష్ణయ్య కితాబిచ్చారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల అమలు కోసం ఏ ఒక్క పార్టీ కూడా స‍్పందించలేదన్నారు..  పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఒక్క జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే హామీ ఇచ్చారని చెప్పారు.

తాను 40సార్లు ప్రధానమంత్రిని కలిశానన్న చంద్రబాబు నాయుడు ఒక్కసారి కూడ బీసీల కోసం మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు.  సెంటిమెంట్లు, డబ్బులు, ప్రలోభాలు, క్షణికావేశాలకు బీసీలు లొంగిపోవద్దన్నారు.  వచ్చే ఎన్నికల్లో  వైఎస్‌ జగన్‌కే ఓటు వేయాలని కోరారు. డిమాండ్లు పెడతానన్న భయంతోనే టీడీపీ బీసీ సభకు తనను పిలవలేదన్నారు. వైఎస్‌ జగన్ మీ డిమాండ్లు చెప్పాలని తనను  ఆహ్వానించినట్టుగా ఆయన చెప్పారు.

ఆర్. కృష్ణయ్య తెలంగాణ అసెంబ్లీకి గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా ఆయన ఎల్బీనగర్ నుండి పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.