తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆభరణాలు ప్రదర్శనకు పెట్టడం మంచి నిర్ణయం కాదని టీటీడీ ఆగమ సలహామండలి సభ్యుడు సుందరవదన భట్టాచార్యులు అన్నారు. 2003నుంచి టీటీడీ ఆగమ సలహామండలిలో సభ్యుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం గర్భగుడిలో స్వామి కైంకర్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

1945వ సంవత్సరం నుంచి తాను తిరుమల క్షేత్రంలో ఉన్నానని ఆయన తెలిపారు. స్వామి కైంకర్యాలు, ఇతర పూజలు, ఆలయంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి తనకు బాగా తెలుసన్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆగమానికి విరుద్ధంగా ఏదో జరిగిపోతోందని ఆరోపణలు చేయడం చాలా అనుమానాలకు దారి తీస్తోందన్నారు. రమణ దీక్షితులు చేసిన ఆరోపణలు తనను ఎంతగానో బాధించాయని ఆయన అన్నారు.

‘‘శ్రీకృష్ణదేవరాయుల పాలనా కాలంలో ఆభరణాలు సమర్పించినట్టు చెబుతుంటారు. శ్రీవారి ఆల యం విమాన సంప్రోక్షణ నుంచీ నేను స్వామికి కైంకర్యాలు నిర్వహిస్తున్నాను. రమణదీక్షితులు ఇప్పుడు చెబుతున్న పింక్‌ డైమండ్‌ను నేనెప్పుడూ చూడలేదు.’’ అని ఆయన వివరించారు.

‘‘గతేడాది పోటు రిపేర్ల సమయంలో మైలపడిన ప్రసాదాలను స్వామికి నైవేద్యంగా పెట్టారని ఆరోపించడం సరికాదు. నా అనుమతితోనే పోటులో రిపేర్లు జరిగాయి. ఆలయంలోని వంటశాల(ప్రసాదం పోటు) దెబ్బతిందనీ, ప్రమాదాలు సంభవించేలా ఉన్నాయనీ టీటీడీ ఉన్నతాధికారులు నా దృష్టికి తీసుకువచ్చారు. ’’

‘‘నేను స్వయంగా పరిశీలించాను. ఏన్నో ఏళ్ల కిందటి నుంచి ఉన్న వంటశాల అది. నెయ్యి కింద పడటంతో పాటు దుమ్మూ ధూళితో మురికి చేరిపోయింది. గోడలు పొగబారిపోయాయి. గడిపొయ్యిలు పాడయ్యాయి. ఇటువంటి స్థితిలో అగ్నిప్రమాదం సంభవిస్తే పోటు కార్మికుల ప్రాణాలకే ప్రమాదం. ఆలయంలోని ముఖ్యమైన కట్టడాలు కూడా దెబ్బతింటాయి.’’

 ‘‘ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆగమ సలహాదారుడిగా మరమ్మతులకు అంగీకరించాను.పడిపోటులో సంప్రోక్షణం చేసి, అమ్మవారి ప్రతిమను ఏర్పాటుచేసి, అక్కడ తయారుచేసిన ప్రసాదాలను శ్రీవారికి సమర్పిస్తారు. ఈ విషయంలో ఎలాంటి లోపం జరగలేదు. ఆ సమయాల్లో రమణదీక్షితులు కూడా ఉన్నారు. అప్పట్లో ఏ అనుమానం వ్యక్తంచేయని ఆయన ఇప్పుడు ఇలా మాట్లాడటమేమిటి? అక్కడ నిధుల కోసం తవ్వకాలు జరిగాయనడం సరికాదు.’’ అని ఆయన వివరించారు.