అధికార వైసీపీకి చెందిన మద్దతుదారులు తన స్థలంపై కన్నేశారని బాపట్ల జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం జగన్ కలిసేందుకు తాడేపల్లికి బయలుదేరారు. వీల్‌చైర్‌లో కూర్చొని తన పిల్లలతో కలిసి పాదయాత్రగా వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. 

అధికార వైసీపీకి చెందిన మద్దతుదారులు తన స్థలంపై కన్నేశారని బాపట్ల జిల్లాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆరోపించారు. తన ఇంటికి దారిలేకుండా ఉమ్మడిగా ఉన్న రోడ్డుకు అడ్డుగా గోడ కట్టేశారని తెలిపారు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ సీఎం జగన్ కలిసేందుకు తాడేపల్లికి బయలుదేరారు. వీల్‌చైర్‌లో కూర్చొని తన పిల్లలతో కలిసి పాదయాత్రగా వచ్చిన ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అర్ధరాత్రి ఉపాధ్యాయురాలు కుటుంబాన్ని అదుపులోకి తీసుకుని బాపట్ల జిల్లాకు తరలించారు. 

బాధితురాలు వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంకు చెందిన గొట్టిపాటి సుధారాణి.. గోపాలపురం మండల పరిషత్‌ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. ఆమె స్వగ్రామం బొడ్డువానిపాలెంలో రూ.15లక్షల వ్యయంతో ఇంటిని నిర్మించుకున్నారు. ఆ ప్రాంతానికి చెందిన వైసీపీ మద్దతుదారులు ఎన్‌.వెంకటేశ్వర్లు, సుబ్బయ్యలు.. ఆమె ఇంటికి వెళ్లే మార్గంలో గోడకట్టారు. దీంతో ఆమె స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. 

ఈ క్రమంలోనే ఆమె తన పిల్లలతో కలిసి న్యాయం కోరుతూ తాడేపల్లికి బయలుదేరారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో వీరు బొడ్డవానిపాలెం నుంచి బయలుదేరారు. సుధారాణి వీల్‌చెయిర్‌లో, మిగిలినవారు పాదయాత్రగా తాడేపల్లికి ప్రయాణం మొదలుపెట్టారు. తమకు న్యాయం చేయాలని ఫ్లకార్డులను కూడా చేతపట్టుకుని ముందుకు సాగారు. 

అయితే తాడేపల్లి మండలం కొలనుకొండ వద్దకు రాగానే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించారు. తమ న్యాయం చేయాలని కోరేందుకు తాడేపల్లి వెళ్తున్నామని.. సీఎం జగన్‌ను కలిస్తేనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుందని, తమకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు చెప్పారు. అయితే పోలీసులు అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే పోలీసులు కొరిశపాడు, అద్దంకి తహసీల్దార్లలకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని సుధారాణికి నచ్చజెప్పగా.. ఫలితం లేకుండాపోయింది. ఆ తర్వాత సుధారాణిని, కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని బొడ్డువానిపాలెంకు తరలించారు. 

దళిత టీచర్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?: లోకేశ్‌
ఆస్తి ఎవరిదైనప్పటికీ.. కన్నుపడితే కబ్జా, ఆక్రమణ... వైసీపీ దౌర్జన్యకాండగా నడుస్తోందని టీడీపీ నేత నారా లోకేశ్‌ ఆరోపించారు. ‘ఓ దళిత టీచరు ఇంటికెళ్లే దారికి అడ్డంగా వైసీపీ నేతలు గోడ కట్టేసినా అడిగే నాథుడు లేడు. సీఎంకు విన్నవించుకుందామని మూడుచక్రాల బండిపై పిల్లలతో కలిసి నడుచుకుని తాడేపల్లి చేరుకున్న బాధితురాలిని అడ్డుకోవడం మరీ దారుణం. దళిత టీచర్‌కూ న్యాయం చేయలేని ముఖ్యమంత్రి ఉండడం మన రాష్ట్రం దౌర్బాగ్యం’ అని శనివారం ఒక ప్రకటనలో లోకేష్ పేర్కొన్నారు.