కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దేవరగట్టు కర్రల సమరాన్ని పోలీసులు నిషేదించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ విధించారు. దేవరగట్టు ప్రాంతంలో 144వ సెక్షన్ విధించారు. దీంతో కర్రల సమరం జరుగుతుందా, లేదా అనే ఉత్కంఠ చోటు చేసుకుంది. బన్నీ ఉత్సవంలో భాగంగా దేవరగట్టులో దసరా సందర్భంగా యేటా బన్నీ ఉత్సవం జరుగుతుంది. 

ఆ ఉత్సవంలో భాగంగా జరిగే కర్రల సమరంలో భక్తులు గాయాల పాలై రక్తసిక్తం అవుతుంటుంది. అక్టోబర్ 21 నుంచి 30వ తేదీ వరకు బన్నీ ఉత్సవాలు జరుగుతాయి. పూజలు సంప్రదాయబద్దంగా జరుగుతాయని అధికారులు చెప్పారు. పూజలకు మూడు గ్రామాలకు చెందిన 50 మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. హోలగుంద, ఆలూరు మండలాల్లో లాక్ డౌన్ విధించడంతో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. 

దేవరగట్టుకు వెళ్లే మార్గాలన్నింటినీ మూసేసి, చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులను లోనికి అనుమతించడం లేదు. దాదాపు 1500 మంది పోలీసులు అక్కడ మోహరించారు. చుట్టపక్కల గ్రామాల్లో మద్యం అమ్మకాలను నిషేధించారు. 

దేవరగట్టు కొండలో మాళ మల్లేశ్వర స్వామి కల్యాణోత్సవం సందర్బంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవ విగ్రహాన్ని దక్కించుకోవడానికి ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. కర్రలతో విచక్షణారహితంగా కొట్టుకుంటారు. ప్రాణాలు పోతున్నా, శరీరాలు రక్తమోడుతున్నా లెక్క చేయరు.