హైదరాబాద్: బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. సుజనా చౌదరి అమెరికా పర్యటనను అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ గతంలో జారీ చేసిన లుక్ అవుట్ నోటీసుల ఆధారంగా ఆయన విదేశీ ప్రయాణాన్ని అడ్డుకోవద్దని హైకోర్టు ఇమిగ్రేషన్ అధికారులకు సూచించింది. 

ప్రయాణ వివరాలతో పాటు ఎప్పుడు తిరిగి వచ్చేది సంబంధిత అధికారులకు అపిడవిట్ ఇవ్వాలని హైకోర్టు సుజనా చౌదరికి సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి చల్లా కోదండరాం హౌస్ మోషన్ పై ఆదేశాలు జారీ చేశారు. 

అమెరికాలోని న్యూయార్క్ లో సుజనా చౌదరి బంధువు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నంలో ఉండగా ఇమిగ్రేషన్ అధికారులు సుజనా చౌదరిని అడ్డుకున్నారు. దాంతో లుక్ అవుట్ నోటీసులపై ఆయన తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

మెసర్స్ బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్టు లిమిటెడ్ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారని, మరో కేసులోనూ ఏ విధమైన దుందుడుకు చర్యలు తీసుకోవద్దని కోర్టులు ఆదేశాలు ఇచ్చాయని సుజనా చౌదరి తరఫున న్యాయవాది చెప్పారు. 

సుజనా చౌదరిపై ఏ విధమైన క్రిమినల్ కేసులు కూడా లేవని, సీబీఐ నమోదు చేసిన కేసులో సహకరిస్తున్నారని ఆయన చెప్పారు. సుజనా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారని, ఆమెరికా వెళ్లి వచ్చేందుకు రెండు వారాల గడువు ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు సుజనా చౌదరి అమెరికా పర్యటనను అడ్డుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.