ఏ నోటీసు ఇవ్వకుండా నిర్బంధించారు.. : పోలీసులపై టీడీపీ నేత బండారు భార్య ఫిర్యాదు..
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద గత రాత్రి నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి నివాసం వద్ద గత రాత్రి నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి ఆయన ఇంటికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు భారీగా సిబ్బందితో అక్కడికి చేరుకుని.. ప్రహారి గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాపై కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు బండారు సత్యనారాయణను ఏ క్షణంలోనైనా పోలీసులు అరెస్ట్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనకు 41ఏ కింద నోటీసులు ఇస్తారా? లేదా అరెస్ట్ చేస్తారా? అనేది క్లారిటీ లేకుండా పోయింది. అయితే మరోవైపు పలువురు టీడీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బండారు సత్యనారాయణ ఇంటి ముందు బైఠాయించి నిరసనకు దిగారు.
మరోవైపు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ లీగల్ సెల్ ప్రతినిధులు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా అక్కడికి భారీగా తరలివెళ్లేందుకు యత్నించాయి. అయితే పోలీసులు టీడీపీ శ్రేణులను బండారు సత్యనారాయణ ఇంటివైపు అనుమతించడం లేదు.
ఈ నేపథ్యంలోనే విశాఖ పోలీసులపై పరవాడ పోలీసు స్టేషన్‌లో సత్యనారాయణ భార్య మాధవీలత ఫిర్యాదు చేశారు. డీఎస్పీ కేవీ సత్యనారాయణ, పరవాడ సీఐ ఈశ్వర్‌రావులపై ఈ ఫిర్యాదు చేశారు. తన భర్తతో పాటు కుటుంబాన్ని నిర్బంధించి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. అర్దరాత్రి నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.
ఇక, రోజాపై అసభ్య పదజాలంతో మాట్లాడరనే ఫిర్యాదతో బండారు సత్యనారాయణపై గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. బండారు సత్యనారాయణపై ఐపీసీ సెక్షన్ 153ఏ, 504, 354ఏ, 505, 506, 509, 499, ఐటీ సెక్షన్ 67 కింద కేసు నమోదు చేశారు. ఇక, బండారు సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కూడా ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే.