ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించిన పోలీసులు.. పలు హెచ్చరికలు జారీ చేశారు. 

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో అధికారులు పలు ఆంక్షలు విధించారు. డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించిన పోలీసులు.. పలు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి 5 కి.మీ పరిధిలో డ్రోన్లు ఎగరవేయొద్దరి ఆంక్షలు విధించినట్టుగా విశాఖపట్నం పోలీసు కమిషర్ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 13 వరకు డ్రోన్ల వినియోగంపై నిషేధం అమలులో ఉంటుందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ కింద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 

ఇక, ప్రధాని మోదీ ఈ నెల 11వ తేదీ సాయంత్రం విశాఖపట్నం చేరుకుంటున్నారు. మధురై విమానాశ్రయం నుంచి బయల్దేరి రాత్రి 7.25 గంటలకు విశాఖకు చేరుకుంటారు. తూర్పు నౌకాదళ కమాండ్‌కు వెళ్లనున్న మోదీ.. రాత్రికి చోళ షూట్ లో బస చేస్తారు. 12 తేదీ ఉదయం చోళ షూట్ నుంచి ఆంధ్ర యూనివర్శిటీకి చేరుకుంటారు. ఆయన 12వ తేదీ మధ్యాహ్నం వరకు విశాఖలోనే ఉండనున్నారు. అయితే ప్రధాని మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్‌ను పీఎంఓ ఇంకా వివరంగా పంపలేదని అధికారులు చెబుతున్నారు. 

ఈ క్రమంలోనే విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పోలీసులును విశాఖకు రప్పిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా విశాఖలో.. రాష్ట్రంలోని వివిధ యూనిట్ల నుంచి, కేంద్ర ప్రభుత్వ బలగాల నుంచి మొత్తం 5,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. విశాఖకు వచ్చే అన్ని కీలకమైన పాయింట్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన భద్రతా బలగాలు.. అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు.