సీఎం క్యాంప్ కార్యాలయానికి బాలినేని.. మధ్యాహ్నం జగన్ తో భేటీ !
వైసీపీ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎస్కార్ట్ వాహనం, గన్ మెన్లు లేకుండానే సీఎం క్యాంపు ఆఫీసుకు వచ్చారు. మధ్యాహ్నం జగన్ తో భేటీ కానున్నారు.

ఒంగోలు : మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు. సీఎంవో అధికారి ధనుంజయ రెడ్డితో ముందుగా ఒంగోలులో చోటు చేసుకున్న తాజా పరిణామాల మీద చర్చించనున్నారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయానికి గన్మెన్లు లేకుండానే బాలినేని వెళ్లారు. రెండు రోజుల క్రితం ప్రకాశం జిల్లాలో పోలీసుల తీరుకు నిరసనగా గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే హైదరాబాదు నుంచి తాడేపల్లికి గన్మెన్లు, పోలీసు ఎస్కార్టు లేకుండానే బాలినేని చేరుకున్నారు. ముందుగా ధనుంజయ రెడ్డితో కలిసి ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎం జగన్ ను కలుస్తారని తెలుస్తోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మంత్రి పదవి పోయినప్పటి నుంచి వైసీపీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే భావనలో ఉన్నారు.
ఈ క్రమంలోనే తన సన్నిహితుల దగ్గర బాలినేని పలుమార్లు పార్టీలో, ప్రభుత్వ అధికారుల దగ్గర తన మాటకి విలువ లేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేసినట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా, ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్ మెన్ లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్ చేస్తున్నట్లు బాలినేని డీజీపీకి లేఖ రాశారు. ఈ స్కాం కేసులో వైసీపీ నేతలు ఉన్నా వదిలిపెట్ట వద్దని ఇప్పటికే పలుమార్లు బాలినేని చెప్పిన విషయం తెలిసిందే.
అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదు అంటూ బాలినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో ఇప్పటివరకు పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు.