అమరావతి: బంట్రోతులంటా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురువారం శాసనసభలో చేసిన వ్యాఖ్యలపై హిందూపురం తెలుగుదేశం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఎమ్మెల్యేలను బంట్రోతు అనడం సరికాదని ఆయన అన్నారు. 

అధికారంలో ఉన్నా,ప్రతిపక్షంలో ఉన్నా ప్రజాప్రతినిధులు ప్రజలకు బంట్రోతులేనని బాలకృష్ణ స్పస్టం చేశారు. అందరూ ప్రజలకు సేవ చేయాల్సిందేనని ఆయన అన్నారు.

గవర్నర్ ప్రసంగం ఆశించిననట్లు లేదని బాలకృష్ణ అన్నారు. శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ఆయన స్పందించారు. చేతి వృత్తుల వారికి ఏం చేస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. జలయజ్ఞం తరహాలో నీటి ప్రాజెక్టుల ప్రస్తావన ఉందని గవర్నర్ అన్నారు. 

గవర్నర్‌ ప్రసంగం సొంత ప్రసంగం కాదని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో చాలా అంశాలపై స్పష్టత లేదని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ ప్రసంగం నవరత్నాలకే పరిమితమైందని అవహేళన చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల రాజధాని గురించి ప్రస్తావన లేకపోవడం విచారకరమని అన్నారు. 

గవర్నర్‌ ప్రసంగమంతా వైసీపీ కరపత్రంలా ఉందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విలీనమని చెప్పి మళ్లీ కమిటీలు ఎందుకని ప్రశ్నించారు.
 
పూర్తి మెజార్టీ ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని, ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఆయన అన్నారు. వైసీపీ కార్యకర్తలకు నెలకు రూ.5 వేల చొప్పున రూ.11 వేల కోట్లు దోచిపెట్టడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లు వైసీపీ తీరు ఉందని బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యానించారు.